– ఎయిరిండియా ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్
న్యూదిల్లీ, జూన్ 12: దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటన జరిగిన నేటికి ఏడాది అయ్యింది. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒక్కే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్. ఏడాది గడిచిపోయినా.. ఆయన ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు కావాలని అడుగుతున్నారు. నేను బతికి బయటపడినదే ప్రజలకు కనిపిస్తుంది. కానీ నాలుగు గోడల మధ్య నేను ఎదుర్కొంటున్న సవాళ్లు ఎవరికీ అర్థం కావు. ఇప్పటికీ నేను నిద్రలేమి, ఆందోళన, చేదు జ్ఞాపకాలతో పోరాడుతున్నాను. ఒక సంవత్సరం గడిచిపోయింది. బతికి ఉన్నందుకు కృతజ్ఞుడినే. కానీ అప్పటినుంచి నేను చేస్తోన్న పోరాటాన్ని మాత్రం మాటల్లో వర్ణించలేను. నా జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ కుటుంబంతో కలిసి ముందుకు సాగుతున్నాను అని జాతీయడియాతో మాట్లాడారు. ఈ బాధ తన ఒక్కడిదే కాదని, ప్రభావిత కుటుంబాలు కూడా ఇదేరకమైన వేదనను అనుభవిస్తున్నాయని విశ్వాస్ చెప్పారు. జరిగిన దానిని ఎవరూ మార్చలేరు కానీ.. ప్రజలకు నిజాయతీ, వారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు. గతేడాది అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన వెంటనే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో విశ్వాస్ కుమార్ ఒక్కడే బయటపడ్డారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్.. గుజరాత్‌లోని తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ఆ సీటు విరిగిపడిపోవడంతో ఆయనకు మంటలు అంటుకోలేదు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో తన సోదరుడు అజయ్‌ను కోల్పోయారు. విమానం హాస్టల్ భవనంపై కూలడంతో మృతుల సంఖ్య 260కి చేరింది. కాగా.. దుర్ఘటనకు సంబంధించిన తుది రిపోర్ట్ రావడానికి ఇంకా రెండు నెలలు పట్టొచ్చని తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


