రాష్ట్ర పోలీసుల‌కు జాతీయ గుర్తింపు

– పాస్‌పోర్టు ధ్రువీకరణలో విశిష్ట సేవలకు..
– డీజీపీ ఆనంద్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆహ్వానం
– 19న అవార్డును అందుకోనున్న డీజీపీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. 2025-26 సంవత్సరంలో పాస్‌పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణలో విశిష్ట సేవలందించిన రాష్ట్ర పోలీసు సంస్థగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేస్తూ ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ(పీఎస్‌పీ) అండ్ చీఫ్ పాస్‌పోర్టు ఆఫీసర్ బి.ఎస్.ముబారక్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి.ఆనంద్‌కు అధికారిక లేఖ పంపారు. ప్రతి సంవత్సరం జూన్‌లో నిర్వహించే పాస్‌పోర్టు సేవ సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది పాస్‌పోర్టు సేవా దివస్, పాస్‌పోర్టు అధికారుల సదస్సు ఈనెల 18, 19 తేదీల్లో న్యూదిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ భవన్‌లో జరగనున్నది. 19న జరిగే కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ ఆనంద్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. పాస్‌పోర్టు జారీ ప్రక్రియలో పోలీసు ధ్రువీకరణ అత్యంత కీలకమైన అంశమని, ఈ విభాగంలో తెలంగాణ పోలీసులు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు దక్కిందని డీజీపీ పేర్కొన్నారు. అలాగే పాస్‌పోర్టు సేవా దివస్‌లో భాగంగా నిర్వహించే హై-లెవల్ సెగ్మెంట్ కార్యక్రమానికి డీజీపీ ఆనంద్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది. రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన సాంకేతిక ఆధారిత పోలీసు ధ్రువీకరణ విధానం, వేగవంతమైన సేవలు అందించడం, ప్రజా కేంద్రిత దృక్పథం వల్లే ఈ జాతీయస్థాయి గుర్తింపు లభించిందని డీజీపీ¾ తెలిపారు. ఈ అవార్డు తెలంగాణ పోలీసుల సేవా నిబద్ధతకు, వృత్తిపరమైన నైపుణ్యానికి మరో నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ పురస్కారం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ఠ మరింత పెరిగిందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రేరణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *