– జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, గ్రామ పంచాయతీల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల పురోగతిని క్షేత్రస్థాయిలో ఆదేశించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ కార్యాలయంలోని సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేసేలా బాధ్యతలు అప్పగించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగం, జీవనోపాధి కార్యక్రమాలు, సామాజిక తనిఖీలు తదితర కీలక కార్యక్రమాల అమలును ప్రత్యేక అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. ప్రతి ప్రత్యేక అధికారి వారానికి కనీసం ఒకరోజు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించాల్సి ఉంటుంది. జిల్లా పర్యటన సందర్భంగా కనీసం రెండు గ్రామ పంచాయతీలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యాల సాధనలో కిందిస్థాయి సిబ్బందికి తగు సూచనలు చేస్తారు. గ్రామ పంచాయతీల్లో కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగం, మల్టీపర్పస్ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది జీతాల చెల్లింపులు, గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణ చర్యలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షిస్తారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన వ్యర్థాల నిర్వహణ, మంజూరైన పనుల పూర్తి, ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులు, నమూనా గ్రామాల అభివృద్ధి, నీటి సంరక్షణ పనులు, జీవనోపాధి కార్యక్రమాలు, దిశా సమావేశాలు, సామాజిక తనిఖీల పురోగతి వంటి అంశాలను కూడా పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చేయడంతోపాటు నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల్లో నాణ్యత, అధికారుల జవాబుదారీతనం పెంచడమే ఈ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ ప్రత్యేక అధికారుల వ్యవస్థ పనిచేయనుండగా, ప్రతి వారం పర్యటనల నివేదికలను సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


