– బీఆర్ఎస్ దోపిడీ వల్లే రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం
– రెండున్నరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్ల అసలు, వడ్డీలు చెల్లించాం
– అప్పులు కడుతూనే అదనపు సంక్షేమ పథకాల అమలు
– మల్లమ్మకుంట భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు
– రైతులను ఇబ్బంది పెట్టం.. సరైన పరిహారం అందిస్తాం
– జులేకల్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వడ్డేపల్లి, ప్రజాతంత్ర, జూలై 14 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేసి రూ.8 లక్షల 21 వేల కోట్ల అపారమైన అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం జులేకల్ గ్రామంలో ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్సీ సంపత్ కుమార్ అధ్యక్షతన మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నాడు తాము రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో, ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే గత పాలకుల పదేళ్ల అనాలోచిత నిర్ణయాలు, అవినీతి వల్ల తెలంగాణ అప్పులకుప్పగా మారిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులకు సంబంధించి రూ.2 లక్షల 8 వేల కోట్ల అసలు, వడ్డీలను బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ నిధులను ఏం చేశారయ్యా అంటే రాష్ట్రంపై పడి దోపిడీ చేశారు తప్ప రాష్ట్ర ప్రజలకు పైసా మేలు చేయలేదని విమర్శించారు. ఇంత ఆర్థిక సంక్షోభంలోనూ తాము ప్రతినెలా రూపాయి రూపాయి పోగేస్తూ పాత అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాం అని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆ ప్రభుత్వం ప్రారంభించిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కొనసాగిస్తున్నామని, వీటితోపాటు అదనంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం ప్రతినెలా ఉద్యోగులకు సకాలంలో జీతాలు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తోందని, మహిళల ఉచిత ప్రయాణానికి రూ.12 వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించిందని వివరించారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగిజావతో కూడిన ఉదయం అల్పాహారం వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. రాబోయే నవంబర్‌లో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నామని ప్రకటించారు.
మళ్లీ వచ్చి ఏం బంద్ చేస్తారు?
పదేళ్లపాటు రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేసి ప్రజలను తాకట్టు పెట్టిన వారు ఇప్పుడు మళ్లీ వస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? పేదలకు ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కట్ చేస్తారా.. ప్రతి కుటుంబానికి ఇస్తున్న సన్న బియ్యాన్ని ఆపేస్తారా.. కోటి 15 లక్షల కుటుంబాలకు రక్షణగా నిలిచే రూ.5 లక్షల ఇందిరమ్మ బీమాను రద్దు చేస్తారా.. లేక మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని, డ్వాక్రా మహిళలకు అందిస్తున్న రూ.76 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను బంద్ చేస్తారా అని బీఆరఎస్ నాయకులను ప్రశ్నించారు.
మల్లమ్మకుంట భూసేకరణకు ఆదేశిస్తాం
పాలమూరు జిల్లా వలసల నివారణకు, వెనుకబడిన ప్రాంతాల సాగునీటి అవసరాలు తీర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పెండింగ్ పనులను వేగవంతం చేశామని, భూసేకరణ నిధులన్నింటినీ క్లియర్ చేశామని చెప్పారు. ఆర్డీఎస్ పరిధిలోని తుమ్మిళ్ల ప్రాజెక్టులో భాగంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నింపడానికి అవసరమైన 573 ఎకరాల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఈ రోజే ఆదేశించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 87,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని భరోసా ఇచ్చారు. భూమితో రైతుకు ఉండే భావోద్వేగ బంధం తమ ప్రభుత్వానికి బాగా తెలుసని భట్టి విక్రమార్క అన్నారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా, తక్కువ ధర నిర్ణయించి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. ఈ సభలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి మాట్లాడారు. కాగా, వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏఐసీసీ సెక్రటరీ సంపత్, చిక్కుడు వంశీకృష్ణ, షాద్‌నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు సరిత, గట్టు తిమ్మప్ప, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు స్వాగతం పలికారు.
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే ధ్యేయం : భట్టి
– జిల్లాలో రూ.376.25 కోట్ల విలువైన సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు
ఎర్రవల్లి : నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అలంపూర్ నియోజకవర్గంలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కెవి ఉప కేంద్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. అలాగే ఎర్రవల్లి మండల కేంద్రం వద్ద రూ.155 కోట్లతో 220/132/33 కెవి ఉపకేంద్రం నిర్మాణానికి కూడా ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా మంగళవారం రూ.376.25 కోట్ల విలువైన విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవాలు చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఆలంపూర్, అచ్చంపేట, షాద్‌నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలు విజయుడు, చిక్కుడు వంశీకృష్ణ, శంకర్, అనిరుద్ రెడ్డి, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండి కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండి జితేష్ వి పాటిల్, సంస్థ డైరెక్టర్లు శివాజీ, నరసింహులు, రూరల్ జోన్ సీఈ బాలస్వామి, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఇన్చార్జి ఎసఈ నాగరాజు, డీఈ రవిప్రసాద్, ఇతర ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు, జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





