ఎల్‌నినో వేడిని తెలంగాణ తట్టుకోగలదా?

“అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ రూపొందించిన ఎల్‌నినో ఉష్ణమరణాల అంచనా వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. 2026 జూన్‌ నుంచి 2027 మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులతో పోలిస్తే సుమారు 8.57 లక్షల అదనపు ఉష్ణసంబంధ మరణాలు సంభవించే ప్రమాదముందని అంచనా వేసింది. ఇందులో అక్టోబర్‌ నుంచి మార్చి మధ్య ఆరు నెలల్లోనే సుమారు 3.73 లక్షల మరణాలు ఉండవచ్చని పేర్కొంది. భారతదేశంలో ఈ కాలానికి సుమారు 55 వేల అదనపు మరణాలు సంభవించే అవకాశముందని అంచనా వేయడం గమనార్హం.”

pendyala
పెండ్యాల కొండల్

తెలంగాణలో రాబోయే వేసవి ఎలా ఉండబోతోంది? ఎండలు సాధారణ స్థాయిలోనే ఉంటాయా? లేక ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తాయా? వడగాడ్పులు, తాగునీటి ఎద్దడి, విద్యుత్‌ వినియోగం, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం ఒకేసారి ఎదురైతే రాష్ట్రం తట్టుకోగలదా? వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగితే వైద్య వ్యవస్థ ఎంతవరకు సిద్ధంగా ఉంది? ఇవి వాతావరణ శాఖకు మాత్రమే సంబంధించిన ప్రశ్నలు కావు. ప్రభుత్వ ప్రణాళిక, ప్రజారోగ్యం, పట్టణ నిర్వహణ, వ్యవసాయ భద్రత, కార్మిక సంక్షేమంతో ముడిపడిన అంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావాలపై వెలువడుతున్న తాజా హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ తన సన్నద్ధతను సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ రూపొందించిన ఎల్‌నినో ఉష్ణమరణాల అంచనా వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. 2026 జూన్‌ నుంచి 2027 మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులతో పోలిస్తే సుమారు 8.57 లక్షల అదనపు ఉష్ణసంబంధ మరణాలు సంభవించే ప్రమాదముందని అంచనా వేసింది. ఇందులో అక్టోబర్‌ నుంచి మార్చి మధ్య ఆరు నెలల్లోనే సుమారు 3.73 లక్షల మరణాలు ఉండవచ్చని పేర్కొంది. భారతదేశంలో ఈ కాలానికి సుమారు 55 వేల అదనపు మరణాలు సంభవించే అవకాశముందని అంచనా వేయడం గమనార్హం. అయితే ఇవి ఇప్పటికే నమోదైన మరణాలు కావు. గత గణాంకాలు, వాతావరణ పరిశీలనలు, భవిష్యత్తు ఉష్ణోగ్రతల అంచనాల ఆధారంగా రూపొందించిన నమూనా ఫలితాలు మాత్రమే. వాస్తవ పరిస్థితులను బట్టి ఈ సంఖ్యల్లో మార్పులు రావచ్చు. అయినా ఇంతటి హెచ్చరికను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.

ఎల్‌నినో అంటే పసిఫిక్‌ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ పరిణామం. దీని ప్రభావంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు మారుతాయి. భారతదేశంలో గతంలో బలమైన ఎల్‌నినో పరిస్థితులు బలహీన రుతుపవనాలతో ముడిపడిన సందర్భాలున్నాయి. అయితే ఎల్‌నినో ఏర్పడిందంటే దేశమంతటా కరువు, తీవ్రమైన ఎండలు తప్పవని భావించడం సరికాదు. ఇతర సముద్ర, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుత ఎల్‌నినో బలపడే అవకాశాలపై వాతావరణ సంస్థలు పరిశీలనలు కొనసాగిస్తున్నాయి. ఇక్కడ మరో అంశాన్ని విస్మరించరాదు. ఇప్పటికే భూతాపం కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో ప్రభావం తోడైతే కొన్ని ప్రాంతాల్లో వేడి తీవ్రత మరింత పెరగవచ్చు.

తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రంలోని 612 మండలాల్లో 590 మండలాలు వడగాడ్పుల ముప్పు ఎదుర్కొనే అవకాశమున్న ప్రాంతాలుగా గుర్తించారు . వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు 1,091 స్వయంచాలక వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇది సానుకూల పరిణామమే. కానీ ఈ సమాచారం ప్రజల ప్రాణరక్షణకు ఎంతవరకు ఉపయోగపడుతోంది? 2024లో రాష్ట్రంలో వడదెబ్బ, వడగాడ్పుల కారణంగా 116 మంది మరణించినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ నమోదు చేయగా, రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో మాత్రం పది మరణాలే పేర్కొనడం గణాంకాల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరణాల గుర్తింపు, ధ్రువీకరణ పద్ధతుల్లో తేడాలు ఉండవచ్చు. అయినప్పటికీ ఈ వ్యత్యాసాన్ని పరిశీలించి, మరణాల నమోదుకు ఒకే విధమైన ప్రమాణాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌లో పరిస్థితి మరో విధంగా ఆందోళన కలిగిస్తోంది. కాంక్రీటు కట్టడాలు, రహదారుల విస్తరణ, వాహనాల రద్దీ, చెట్ల తగ్గుదల, చెరువుల కుంచింపు నగరంలో వేడిని పెంచుతున్నాయి. పగటిపూట ఎండల తీవ్రతతో పాటు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోతే ప్రజలకు ఉపశమనం లభించదు. మరోవైపు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై ఆధారపడే ప్రజలు అధిక ఉష్ణోగ్రతల బారిన పడే ప్రమాదముంది. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఎండల నుంచి తప్పించుకునే అవకాశం తక్కువ. పని మానుకుంటే ఆదాయం పోతుంది. పనిచేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ముప్పు మరింత ఎక్కువ.

ఇంతటి పరిస్థితుల్లో రాష్ట్ర సన్నద్ధత కేవలం వాతావరణ హెచ్చరికలకే పరిమితం కాకూడదు. ప్రతి మండలం, పట్టణ వార్డు స్థాయిలో ప్రమాద ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ దవాఖానాలు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ చికిత్సకు అవసరమైన మందులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలి. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో తాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలి. తీవ్రమైన ఎండల సమయంలో పని వేళలను మార్చేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, అంగన్‌వాడీలు, వృద్ధాశ్రమాలకు ప్రత్యేక రక్షణ ప్రణాళికలు ఉండాలి. నగరాల్లో చెట్ల పెంపకం, చెరువుల పరిరక్షణ, పచ్చని ప్రదేశాల విస్తరణకు ప్రాధాన్యమివ్వాలి. తాగునీటి సరఫరా, విద్యుత్‌ అంతరాయాల నివారణకు వేసవి ప్రణాళికను ముందుగానే అమలు చేయాలి. ముఖ్యంగా ఎండల వల్ల సంభవించే మరణాలపై పారదర్శకమైన గణాంక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ఎల్‌నినోను నియంత్రించడం తెలంగాణ చేతుల్లో లేదు. కానీ దాని ప్రభావానికి ప్రజలు బలికాకుండా చూడటం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వాతావరణ కేంద్రాల సంఖ్యను పెంచడం ఎంత ముఖ్యమో, వాటి హెచ్చరికల ఆధారంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు రక్షణ చర్యలు చేపట్టడం అంతకంటే ముఖ్యం. వేసవి వచ్చిన తరువాత స్పందించడం కంటే, ముందుగానే నీరు, నీడ, వైద్యం, సురక్షిత పని పరిస్థితులు కల్పించాలి. ఎల్‌నినో వేడికి తెలంగాణ ఎంత సిద్ధంగా ఉందన్న ప్రశ్నకు సమాధానం ప్రభుత్వ ప్రకటనల్లో కాదు.. ప్రజలకు అందే రక్షణ చర్యల్లో కనిపించాలి. ప్రకృతి వైపరీత్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా, దాని వల్ల కలిగే ప్రాణనష్టాన్ని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *