– 19 నుంచి 22 వరకు జరిగే సమావేశంపై చర్చ
– రోడ్లు, భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) 85వ సమావేశాన్ని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. రోడ్లు, భవనాలు శాఖ అధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఐఆర్సీ సమావేశంపై కూడా చర్చించారు. 19వ తేదీన ముఖ్య అతిథులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, అన్ని రాష్ట్రాల రోడ్లు భవనాలు శాఖ మంత్రులు, వివిధ దేశాల నుండి, ఇతర రాష్ట్రాల డెలిగెట్స్ హాజరుకానున్నారని తెలిపారు. అతిథులకు వసతి, రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకూడదని, అందుకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో ఐఆర్సీ సదస్సు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా, తెలంగాణ ప్రగతి తెలిసే విధంగా ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన’ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని మాధ్యమాల్లో ఐఆర్సీపై విస్తృత ప్రచారం చేయాలని, ఎయిర్పోర్టు, మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ప్రదేశాల్లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక విజువల్ ప్రకటనలు ప్రదర్శించాలని తెలిపారు. దిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్పోర్టు, మెట్రోలో కూడా ప్రకటనలతోపాటు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే గ్లోబల్ సమ్మిట్(ఇన్వెస్ట్ తెలంగాణ)కు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రీ ‘ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్*గా నిలిచేలా నిర్వహించాలని కూడా సూచించారు. తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి సెక్రటరీ ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, ఎంవోఆర్టీహెచ్ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఎన్హెచ్ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్లు లింగారెడ్డి(అడ్మిన్), బి.వి.రావు,వసంత్ నాయక్, ధర్మారెడ్డి, నర్సింగ్ రావు, రాజేందర్, రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





