– చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహించొద్దు
– అవసరానికి అనుగుణంగా గ్రీన్ ట్యాంకర్లు
– ట్రాఫిక్ క్రమబద్దీకరపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– మున్సిపల్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై దిశానిర్దేశం చేశారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ప్రతిరోజూ ఇంటింటా చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని వివిధ ఇండస్ట్రియల్ ఏరియాల్లో చెత్త సేకరణకు ‘ఐలా’ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్‌తో పాటు ఇతర పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్రీన్ ట్యాంకర్లను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింటెనెన్స్, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగు నీటిని ఉపయోగిస్తున్నారని, దీనికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే జలమండలి తొలి విడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీతోపాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని సీఎం సూచించారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైనచోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





