– ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు, సర్వే, సెటిల్మెంట్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెండు విభాగాల సరిహద్దు వివాదాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఏమాత్రం నష్టపోకూడదని, రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని, ఈ సర్వేలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో నిర్వహించి భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు. శాస్త్రీయంగా సరిహద్దులను నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తిరిగి తలెత్తకుండా శాశ్వతంగా తెరపడుతుందన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని వెల్లడించారు. భూ రికార్డులలో పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి ఉద్ఘాటించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో, పట్టుదలతో పనిచేసి దశాబ్దాల నాటి భూ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని మంత్రి సూచించారు. ఈ సర్వేకు క్షేత్రస్దాయిలో రైతులు, ప్రజలు సహకరించాలని సూచించారు. జిల్లా, మండలస్జాయిలో రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో కమిటీలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





