– ఒక్క ఓటుతో గెలిచిన సేతుపతి వోటింగ్‌కు దూరం
– విశ్వాస పరీక్షలో ఓటేయవద్దని హైకోర్టు ఆదేశం
చెన్నై, మే 12: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న వేళ ఒక టీవీకే ఎమ్మెల్యేకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో నెగ్గిన ఆ ఎమ్మెల్యే సభలో సీఎం విజయ్ బలపరీక్షలో పాల్గొనవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో విజయ్ బలపరీక్షలో టీవీకే కూటమి బలం 119 సీట్లకు పడిపోయినట్లయ్యింది. ఇటీవలి ఎన్నికల్లో శివగంగై జిల్లా తిరుప్పత్తూర్ నియోజకవర్గం నుంచి టీవీకే నేత శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెరియకరుప్పన్‌పై ఒకే ఒక్క వోటు తేడాతో సేతుపతి గెలుపొందారు. పెరియకరుప్పన్‌కు 83,374 ఓట్లు పోలవగా శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఫలితాలపై పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు పక్రియలోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయని, కావున రీకౌంటింగ్ జరపాలని ఆయన అభ్యర్థించారు. అప్పటివరకు సేతుపతి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెరియకరుప్పన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం విజయ్ విశ్వాసపరీక్ష ఓటింగ్‌లో శ్రీనివాస సేతుపతి పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ కలుపుకుని ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బలపరీక్షలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో విజయ్ బలం 119కి తగ్గిపోయింది. అయితే బలపరీక్షలో నెగ్గేందుకు ఎలాంటి అవాంతరం లేదు.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



