“మనిద్దరికీ యింక బ్రేకప్” చెప్పిందా అమ్మాయి.
అబ్బాయి యేమీ మాట్లాడలేదు.
“ఇనిపిస్తలేదా? బ్రేకప్ చెప్పినగ, యింక పో…” అని కూడా అనేసింది.
అబ్బాయి దించిన తలయెత్తి అమ్మాయి ముఖంలోకి చూడాలనుకున్నాడు. కాని అవకాశం లేకపోయింది. చీకటి నీడల్లో నీడల్లాగ కలిసిపోయి నిలబడ్డారిద్దరూ.
అమీర్ పేట హాస్టళ్ళ దగ్గర అందరు అమ్మాయిలూ అబ్బాయిలూ కలుసుకున్నట్టే తాము రోజూ కలుసుకుంటారు. కాని యిదే ఆఖరురోజంటే ఆ అబ్బాయి గుండె బరువుగా వుంది. మాట రావడం లేదు. చెప్పాలంటే ఆలోచనలు కూడా ఆగిపోయాయి.
“బ్రేకప్ చెప్పినంక యింక మాటలేంది? చల్ నడువ్…” అంటూ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోలేదు.
అబ్బాయి తన బుగ్గమీద తనే వొక్కటి కొట్టుకున్నాడు.
అమ్మాయి వులిక్కిపడింది. మళ్ళీ అబ్బాయి అరచేత్తో మరో బుగ్గమీద మరొక్కటి చరుచుకున్నాడు.
అమ్మాయి ఆశ్చర్యపోయి చూసింది. తనూ యీ హాస్టళ్ళచుట్టూ జరిగిన అనేకకథలు చూసింది. అబ్బాయిలు అమ్మాయిల చెంపలు పగలకొట్టడం చాలాసార్లు చూసింది. ‘ఈ కుర్రగాళ్ళు అప్పుడే మగనాకొడుకులు అయిపోయారు’ అని తిట్టుకుంది. కొందరయితే అమ్మాయిల జుట్టుపట్టి యీడ్చికొట్టడమూ చూసింది. అలాంటప్పుడే ప్రేమంటే యిష్టం పోయేది. పెళ్ళంటే భయం వేసేది. అందుకనే మొదట్నుంచి తనే కావాలనే అప్పర్ హేండ్ తీసుకుంది.
మళ్ళీ తన బుగ్గమీద తనే కొట్టుకున్నాడు అబ్బాయి. ‘సారీ’ అంటూ.
ఆపాలనుకుంది అమ్మాయి. కాని ఆపలేదు.
చీకట్లో కనుగుడ్లు మెరుస్తున్నాయి తప్ప యే భావాలూ కనిపించడం లేదు. అబ్బాయిని అమ్మాయి చదవలేకపోయింది.
ఈసారి నుదురుమీద కొట్టుకున్నాడు అబ్బాయి. ముక్కుమీదా. మళ్ళీ బుగ్గమీదా. టపాటపా కొట్టుకుంటున్నాడు.
“చాల్లే, వూకే కొట్టుకోకు. అయినా చేసిన తప్పు లెంపలేసుకుంటే పోతదా?” అమ్మాయి పెద్ద ఆరిందలా అడిగింది.
అబ్బాయి యేమీ మాట్లాడలేదు, అలాగే నిలబడ్డాడు.
“బ్రేకప్ కేన్సిల్, పోయి పండగ చేస్కో పో” అనేసి ఆ అమ్మాయి నవ్వుకుంటూ ఫాస్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అమ్మాయి వెళ్తున్నవంకే చూస్తూ నిలబడ్డాడు అబ్బాయి. అమ్మాయి కనుమరుగైంది. చీకట్లోంచి అబ్బాయి కదుల్తూ మెడమీద చేతులమీద కొట్టుకున్నాడు. ఆపై సెల్ ఫోను తీసి లైట్ వేసి చేతులు చూసుకున్నాడు. చేతుల నిండా రక్తం.
అప్పుడే మరో దోమ ఆ అబ్బాయి చేతిమీద వాలి కుట్టబోతోంది. ఇంకో దోమ దానితో పోటీ పడుతోంది. ముఖమ్మీద మరికొన్ని తిరుగుతున్నాయి. చేతిమీది దోమని అరచేత్తో మళ్ళీ కొట్టబోయి ఆగి “థాంక్స్” చెప్పాడు, చేతిని కదుపుతూ. ఆపై అక్కడినుండి నవ్వుతూ ఆనందంగా అడుగులు వేశాడు అబ్బాయి.





