రెండు తెలతెల్లని ముసలి ఆవుల్లాంటి
ఇద్దరు అవ్వలు
మాజీ ఆటగత్తెలు
నలుగురు ఆడపిల్లలు
రేపటి ఆట బుర్రకెక్కించుకుంటున్న విద్యార్థినులు
మీసం దువ్వే
పురుషుడొక్కడు
సింహం జూలు తగిలించుకున్న మేకపోతు
పనికి వొంగినట్టు నటించే సూపర్ వైజరు
వాడు మామూలోడు కాదు
మనసు కరిగిపోయే మాటలు
మంత్రంలా చదువు వాడు
ఆమె
పిల్లల్ని వెంటబెట్టుకొని
ఊళ్ళోకి వచ్చిన ఆడపులి
ఆట ముగిసిన ప్రతి చోటా పలుకరించే
వెకిలి నవ్వులు వంకర మాటలకు
సలసలా మసులుతున్న అగ్నిపర్వతం
తల కిందికి
కాళ్ళు పైకి
తిరగబడ్డ అరికాళ్ళ పై మట్టికుండ
కుండ కింద పడకుండా
కల ముక్కలవ్వకుండా
బువ్వకుండ చేజారకుండా
మాడుతున్న పేగు చుట్టకుదురు
అందరూ చప్పట్లు కొడుతుంటే
తన పాలు తాగే పిల్లల
తన చేతి గోరుముద్దలు చప్పరించే పిల్లల
చిట్టి చిట్టి చేతుల
ఆకలి డప్పు మోగుతుంటే
ఒకడు పది
ఒకడు వంద
ఏతులుకు ఎవడన్నా వెయ్యి చదివించినా
పూట గడువని బతుకాట
కురిసీ కురువని వానలా
రాలుతాయో రాలయో తెలియని
పిడికెడు నవ్వుల కోసం
పడితే లేవని ప్రాణం
ప్రమాదం నడుముకు కట్టుకుని
తీగె మీద నడుస్తున్నది
కడుపు కాలుతున్న విన్యాసం
మెతుకు పంట కోసుకొచ్చే
కొడవళ్ళు నూరుతున్నది
కక్షగట్టి వచ్చే కాయకష్టాల
వొళ్ళు కుళ్ళబొడిచే
రాజ శాసనాలు పండించడానికి
పురిటి నొప్పుల వ్యవసాయం
నింగి నేల మధ్య ఆటాడుతున్నది.
– గజ్జెల రామకృష్ణ





