– సీఎం రేవంతా.. పొంగులేటా?
– కాక రేపిన కొండా సురేఖ తనయ
– ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ మల్లు రవి
– కాక రేపిన కొండా సురేఖ తనయ
– ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ మల్లు రవి
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ సంచలన ప్రకటన చేశారు. పరకాల నియోజకవర్గంలో సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పరకాల నియోజకవర్గ రాజకీయాలపై సుష్మితా పటేల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందన్నారు. ’పొంగులేటి ముఖ్యమంత్రా.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? అసలు ఎవరు సీఎం అనేది అర్థం కావడం లేదు’ అని కూడా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తన తండ్రి మురళి కూడా సహకరించారని సుష్మితా పటేల్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయంలో మురళి సహకారం ఉందన్నారు. అందుకు ప్రతిఫలంగా కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఇక్కడి మైసమ్మపై ప్రమాణం చేయగలరా అని సుష్మిత సవాల్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్యానించారు. రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని సుష్మిత ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తమ ఇలాఖాకు వచ్చి తమతో ఎందుకు పెట్టుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన అవినీతిపై ఇప్పటివరకు రూ.200 కోట్ల వ్యవహారాన్ని మాత్రమే బయటపెట్టానని సుష్మిత ఆరోపించారు. తనపై కౌంటర్ ఇస్తే మరిన్ని విషయాలను బయటపెడతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల సమయానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారో, ఉండరో కూడా సందేహమేనని సుష్మితా పటేల్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. పూర్తి వివరాలు తెప్పించుకున్న తర్వాత ఆమెపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




