– సీఎం రేవంత్ పై చిట్టెక్క ఘాటు విమర్శలు
– జెన్ జీ అంటూ డైపర్లు వేసుకునే వ్యక్తికి టికెట్టా?
– పీసీసీ నేతలపై కొండా సుష్మిత తీవ్ర విమర్శలు
– ‘అచ్చా కాంగ్రెస్ – పచ్చ కాంగ్రెస్’ కామెంట్లతో తీవ్ర సంచలనం
– దమ్ముంటే పరకాలలో నాపై పోటీ చేసి గెలవాలి : రేవూరికి సవాల్
(మండువ రవీందర్రావు, ప్రజాతంత ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సుష్మితా పటేల్(చిట్టెక్క) ఘాటైన విమర్శలు చేశారు. తాజాగా ఆమె చేసిన ప్రసంగం కాంగ్రెస్ రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారాయి. ఒక దశలో ఆమె రేవంత్‌రెడ్డికి గౌరవాన్నికూడా ఇవ్వకుండా నిలదీసే ప్రయత్నం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన్ను మాట తప్పిన వ్యక్తిగా పేర్కొన్నారు. సీఎం కుర్చీ కాపాడుకోవాలంటే నిబద్దతతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తర్వాత రేవంత్‌రెడ్డి తీరులో మార్పు వచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంలో తన తండ్రి కొండా మురళీధర్‌రావు పాత్రను ఆయన మరిచిపోవడమేకాక ఆ సందర్భాల్లో తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడన్నారు. తన తండ్రి మురళిని ఎమ్మెల్సీగా చేస్తామన్న విషయాన్ని ఆయన నిలబెట్టుకోలేదంటూ ఆ మాట చెప్పలేదని స్థానిక మైసమ్మ సాక్షిగా రేవంత్‌రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ నుండి వచ్చిన వారి పెత్తనం ఎక్కువగా ఉందన్న విషయాన్ని నిగూఢంగా ఆమె అచ్చా కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్‌ల మధ్య పోటీ నడుస్తున్నదంటూ కామెంట్ చేశారు. మరో పదేండ్లపాటు తానే సీఎంగా ఉంటానంటూ రేవంత్‌రెడ్డి ఎలా ప్రకటించుకుంటారని, వైఎస్ లాంటి నాయకుడు కూడా అలా ఎప్పుడూ చెప్పుకోలేదని విమర్శించారు. కొడంగల్‌లోనే ఓడిపోయిన విషయం ఆయన మర్చిపోయినట్లుందని గుర్తు చేశారు. బీసీ కులాల వారిని చిన్నచూపు చూస్తున్నాడంటూ సుష్మిత మరో బలమైన ఆరోపణ చేసింది. హైదరాబాద్ ఇండ్ల పంపిణీలో బీసీ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీస్తూనే సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్‌రెడ్డి ఇంతకాలంగా సీఎం కు ఏం సలహా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పరకాల నాయకుల మధ్య చాలాకాలంగా గొడవ
నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ నాయకుల మధ్య చాలాకాలంగా గొడవ కొనసాగుతున్నది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సుష్మిత తల్లి కొండా సురేఖ దంపతులకు ఇక్కడ మంచి పట్టు ఉంది. కాగా, సురేఖ గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంనుండి శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల సమయంలోనే కొండా దంపతులు మూడు స్థానాల్లో పోటీకి డిమాండ్ చేశారు. ఆ తర్వాత మురళికి ఎమ్మెల్సీ, సురేఖకు, ఆమె కుమార్తెకు పరకాల స్థానం విషయంలో గట్టి ప్రయత్నాలు జరిగాయి. కానీ, సురేఖకు మాత్రమే వరంగల్ తూర్పు నియోజకవర్గం టికట్ లభించింది. గతంలో నర్సంపేట ఎంఎల్‌ఏగా కొనసాగిని రేవూరు ప్రకాశ్‌రెడ్డికి అనుకోని విధంగా పరకాల టికట్ లభించింది. కానీ, కొండా దంతులు మాత్రం అది తమ స్థానంగా, ఎప్పటికైనా తామే అక్కడ ప్రాతినిథ్యం వహిస్తామని చెప్పుకుంటున్నారు. ఆమేరకు అక్కడ సుష్మిత స్వచ్చంద కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా రేవూరి పరకాల అభివృద్ధికి బాగా పనిచేస్తున్నారని, మరోసారి ఆయనకే టికట్ ఇస్తామని ప్రకటించారు. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో తుఫాన్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా అభ్యర్థిని సీఎం అప్పుడే ఎలా ప్రకటిస్తారని పటేల్ తీవ్రంగా ద్వజమెత్తారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలో నిలబడేది, గెలిచేది తామేనని ఆమె ఛాలెంజ్ చేస్తున్నది. ఒకపక్క జెన్ జీలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి డైపర్లు వేసుకునే వ్యక్తి (రేవూరిని దృష్టిలో పెట్టుకుని) టికట్ ఎలా ప్రకటిస్తారంటూ ధ్వజమెత్తింది. మంత్రి సురేఖ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం వరంగల్ జిల్లా గీసుకొండలో సుష్మితా పటేల్ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వాడీవేడి రాజకీయ ప్రసంగం కాంగ్రెస్‌లో కలకలాన్ని సృష్టించింది. ఆమె ఆవేశపూరిత ప్రసంగం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందా.. లేక మరెవరైనా ఉన్నారా అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంపై అంత నమ్మకమే ఉంటే సాక్షాత్తు రేవంత్‌రెడ్డి లేదా రేవూరి ఎవరైనా రాజీనామా చేసి వచ్చి తనకు పోటీగా నిలబడాలని కూడా సుష్మిత సవాల్ చేస్తున్నది. తమ ఇలాఖాలో తమతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నది. అయినా రేవంత్ ఎవరు టికెట్లు ప్రకటించడానికి, అది అధిష్టానం చూసుకుంటుందని, టికట్ల విషయంలో రేవంత్ ప్రమేయమేమీ ఉండదన్న రీతిలో మాట్లాడింది. తనను గెలికితే రేవంత్‌రెడ్డి సోదరుల అనేక అక్రమాలు బయటపెడతానని హెచ్చరించింది కూడా. ఇప్పటికే రూ.200 కోట్ల వ్యవహారాలను బయటపెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. కాగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి సీఎం రేవంత్‌రెడ్డా లేక పొంగులేటా అని ప్రశ్నించడం చూస్తుంటే తన రాజకీయ భవిష్యత్ అటో ఇటో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నది.
గతం నుంచే విభేదాల సెగలు
గతేడాది అక్టోబర్ లో సుష్మిత ఇలాగే సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తమ వెనుకబడిన తరగతుల (బీసీ) నేపథ్యం కారణంగా తన తల్లికి, తమ కుటుంబానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కేబినెట్ సహచరులు, సీనియర్ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక రోజు ముందే తన పదవి నుంచి తొలగింపునకు గురైన సురేఖ మాజీ ఒఎస్‌డీ ఎన్.సుమంతును మంత్రి నివాసంలో పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించిన ఒక రోజు తర్వాత సుష్మిత ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రూ. 71 కోట్ల విలువైన మేడారం జాతర అభివృద్ధి పనుల ఖరారులో మంత్రి సురేఖను పక్కనపెట్టారని మంత్రి పొంగులేటిపై సుష్మిత ఆరోపించారు. ‘పొంగులేటి మా అమ్మకు ఫోన్ చేసి మా బిడ్డర్ ను తన టెండరు ఉపసంహరి చుకోమని చెప్పమన్నాడు.. ఆమె నిరాకరించడంతో అతను ఆ పనులను రెవెన్యూ విభాగానికి బదిలీ చేయించి కాంట్రాక్టు తనకే దక్కేలా చూసుకున్నాడు’ అని సుష్మిత ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




