పక్కా ప్రణాళికతో ఎల్-నినోను ఎదుర్కొందాం

– వచ్చే వంద రోజులకు సరిపడా తాగునీటి నిలువలు ఉన్నాయి
– స్థానిక నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి
– ‘జలసిరి’ ద్వారా జల సంరక్షణ చర్యలు చేపట్టాలి
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : దేశవ్యాప్తంగా ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. తన అధ్యక్షతన సచివాలయంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలపై రోజూ సమీక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. సింగూరు, పాలేరు వంటి కొన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గినప్పటికీ వచ్చే వంద రోజులపాటు రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు వివరించగా దానిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. 2023లో కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకుండా చేశాం.. ఈసారి కూడా అదే నిబద్ధతతో పనిచేయాలి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23,455 ఆవాసాల్లో 90 శాతం గ్రామాలకు సాధారణ స్థాయిలో తాగునీటి సరఫరా కొనసాగుతుండటం సానుకూల పరిణామమని, మిగిలిన ప్రాంతాల్లోనూ సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే 145 పట్టణ స్థానిక సంస్థల్లో 140 యూఎల్‌బీలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా కొనసాగుతుండటం, మిగిలిన మున్సిపాలిటీలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా జరుగుతూ ఉండటం సంతృప్తికరమని అన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలి

మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, గ్రామాల్లో మహిళా సంఘాలు, సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నీటి సరఫరా సమయాలపై ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు. పైప్‌లైన్ లీకేజీలు, మరమ్మతుల కారణంగా ఒక రోజైనా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి వస్తే ముందుగానే గ్రామస్తులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా ప్రజలు తగు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. గ్రామాల్లోని బోర్‌వెల్స్ ను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలని, వాటి వద్ద రీచార్జ్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక నీటి వనరులను బలోపేతం చేస్తూ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి నీటి బొట్టును సంరక్షించే దిశగా గ్రామస్థాయిలో అవగాహన పెంచాలని సూచించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. త్వరలో మండల వారీగా సర్పంచ్‌లతో ఏఈలు సమావేశాలు నిర్వహించి తాగునీటి తాజా సరఫరాపై సర్పంచ్‌ల సంతకాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథకు ఇంకా అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాలను ఏఈలు వారం రోజుల్లో సందర్శించి నివేదిక సమర్పించాలని, కొన్ని గ్రామాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారం రోజుల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహిస్తానని, నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన అధికారులను ఉపేక్షించమనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *