బంగారం, రాగి వెలికితీసి దేశ సంపద పెంచుదాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు
– దేవదుర్గలో కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించిన భట్టి
– సైట్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి: సింగరేణి అధికారులకు ఆదేశం

బెంగళూరు, ఆగస్టు 27 : కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన గురువారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఖనిజ అన్వేష ప్రదేశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాదాపు 136 సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ్ బ్లాక్ ఎక్స్‌ప్లోరేషన్(అన్వేషణ) హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ అన్వేషణ పనులను సింగరేణి సంస్థ త్వరలోనే వేగవంతం చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై ఇక్కడ బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాక ఈ ప్రాంతం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణకు అధికారులు ఇక్కడే ఉండేలా సింగరేణి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక సైట్ ఆఫీస్‌ను, అలాగే రాకపోకల సౌకర్యార్థం హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించిన వెంటనే ఈ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. అలాగే, కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య విడదీయరాని చారిత్రక, సాంస్కృతిక బంధం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమైనందున మన మూలాలు ఒక్కటేనని గుర్తుచేశారు. స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును త్వరలోనే విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడదామని పిలుపునిచ్చారు. ఈ అన్వేషణ రెండు రాష్ట్రాల పురోగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. దేవదుర్గ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సింగరేణి సీఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో సీఐగా పనిచేశానని, ప్రస్తుతం సింగరేణి సంస్థ చైర్మన్, డైరెక్టర్‌గా ఇక్కడ బంగారం, రాగి గని పనులను స్థానికుల సమక్షంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పరమానంద స్వామి గుట్ట పరమానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ బంగారు నిక్షేపాలు లభించాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.

భట్టికి ఘనస్వాగతం 

లింగదహళ్ళికి చేరుకున్న భట్టి విక్రమార్కకు రాయచూరు జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ పూవిత, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు తనయుడు కాంగ్రెస్ నాయకుడు రవి బోసురాజు, స్థానిక సర్పంచ్ ఎల్లమ్మ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. లింగదహళ్ళిలోని దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూ పాయింట్ నుంచి ఖనిజ అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడి బ్లాక్ నుంచి సింగరేణి అధికారులు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించబోయే బంగారం, రాగి వెలికితీత, అన్వేషణ ప్రక్రియల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరేణి అధికారులు, కర్ణాటక రాష్ట్ర అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ఖనిజ అన్వేషణపై దిశా నిర్దేశం చేశారు. లింగదహళ్ళిలోని చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ పరమానంద శివాలయాన్ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ సీకే వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ట, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, సింగరేణి ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *