– 2 నుంచి వారం రోజులపాటు బీఆర్‌ఎస్ నిరసనలు
– 420 హామీలు అమలు కానందుకు
– నియోజకవర్గాల్లో ధర్నా, వంటావార్పులు, రైతు సదస్సులకు పిలుపు
– చివరి రోజున అంబేద్కర్ విగ్రహాలకు వినతులు
(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) సమరభేరి మోగించేందుకు రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని నేటికి వెయ్యి రోజులైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలుపుకోలేకపోవడంతో బిఆర్‌ఎస్ ప్రజా పోరాటానికి సిద్దమైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలోని ప్రధాన దేవతల సాక్షిగా గ్యారంటీలను అమలు చేస్తామన్న సర్కార్ మాట నిలబెట్టుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంటోంది బీఆర్‌ఎస్. పైగా గతంలో అమలులో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దానికితోడు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యో గులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ తీరును ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలను కొనసాగించబోతున్నది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తగిన సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను ప్రతీ గడపకు చేర్చడంద్వారా ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. ఇందుకుగాను సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్‌లో పోరాట ప్రణాళికకు సంబందించిన సమగ్ర ఛార్జిషీటును విడుదల చేయనున్నారు.
సెప్టెంబర్ 2న ప్రభుత్వం ప్రకటించి అమలు చేయలేకపోయిన ఆరు గ్యారంటీలను ఉద్ఘాటిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ‘420 హామీల మోసం’ పేరుతో ఫ్లెక్సీల ప్రదర్శన, ప్రభుత్వం ఇంతకాలంగా లబ్దిదారులకు చెల్లించకుండా బకాయపడిన తీరుకు సంబందించిన ‘బాకీ కార్డు’లను ఇంటింటికి పంపిణీ చేస్తారు. 3న సాగునీరు, ఉచిత విద్యుత్, యూరియా కొరత, పంటల బీమా తదితర సమస్యలపై ‘రైతు సదస్సు’లను, అన్ని నియోజకవర్గాల్లో చర్చా వేదికలను నిర్వహిస్తారు. 22 ఎ భూముల విషయంలో ఆందోళన చేపట్టనున్నారు. 4న మహిళలు, వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపైన నిరసనలు. మహిళలకు ఇస్తానన్న 2500 ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, తులం బంగారం హామీలను విస్మరించడంపై మహిళలతో కలిసి వంటావార్పు కార్యక్రమం. 5న యూత్ డిక్లరేషన్ అమలు కాకపోవడంపై.. జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయాలపై యువతతో భారీ ర్యాలీలుంటాయి. అలాగే సింగరేణి, ఆదిలాబాద్ సిసిఐ ప్రాంతాల్లో కార్మికుల సమస్యలపై సదస్సులుంటాయి. 6న ప్రధానంగా హైదరాబాద్ నగర సమస్యలపై ఉంటుంది. డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం(పల్లెల్లోకూడా), శాంతిభద్రతల సమస్యలతో పాటు ఆటో కార్యికుల సమస్యపైన భారీ ర్యాలీలను నిర్వహించాలని బిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. 7న జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కేంద్రాలకు వెళ్ళి అక్కడ విజ్ఞప్తులు చేసుకోవడానికి వచ్చిన వారికి ప్రభుత్వ వైఫల్యాలగురించి వివరిస్తారు. 420 హామీలపై ఫిర్యాదు లేఖలను సమర్పించాలని నిశ్చయించారు. 8న చివరి రోజు వారం రోజులపాటు నిర్వహించిన నిరసన కార్యక్రమాలపై సమగ్రంగా ప్రతినిథులు మీడియాకు వివరించడంతోపాటు, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి ఫిర్యాదు పత్రాలను అందజేయనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





