ముగింపు దశకు ఇందిరా మహిళాశక్తి భవనాలు

– మహిళా సాధికారతే లక్ష్యం
– త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
– మహిళా సంఘాలకు మౌలిక వసతులు
– జిల్లాస్థాయిలో సాధికారత కేంద్రాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి, శిక్షణ, వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి(ఐఎంఎస్) భవనాల నిర్మాణ ప నులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వర లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనాలను ప్రారంభించేందుకు మంత్రి సీ తక్క ఆదేశాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక లాపాలకు జిల్లాస్థాయిలో శాశ్వత మౌలిక వసతులు కల్పించడంతోపాటు మహిళలకు అవసరమైన శిక్షణ, సమావేశాలు, వ్యాపారాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన. మార్కెటింగ్ వంటి కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించేలా ఈ భవనాలను రూపొందిస్తున్నారు. సెర్చ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ భవనాలు భవిష్యత్లో మహిళా సంఘాల ఆర్థిక కార్యక లాపాలకు కీలక కేంద్రాలుగా మారనున్నాయి.

222 జిల్లాల్లో రూ.110 కోట్లతో నిర్మాణం

రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఐఎంఎస్ భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో భవనం సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.110 కోట్లు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఈ భవనాలను కేవలం కార్యాలయాలుగా కాకుండా మహిళా సంఘాలకు చెందిన ఆస్తులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయా జిల్లాల జల్లా సమాఖ్యలు వీటిని సొంతంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు అనుగుణంగా భవనాల వినియోగం, నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు.

అవ‌స‌రాల‌క‌నుగుణంగా ఆధునిక సదుపాయాలు

ప్రతి భవనంలో మహిళా సంఘాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృతమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. 100 మంది సామర్థ్యంతో జనరల్ బాడీ సమావేశ మందిరం, 50 మంది సామర్థ్యంతో శిక్షణా మందిరం, రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, కార్యాలయాలు, సిబ్బంది గదులు, ఉత్పత్తుల ప్రదర్శన ప్రాంతం, స్టోర్, కిచెన్, ఇండోర్, అవుట్‌డోర్ డైనింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతి గదులు, డార్మిటరీలను ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలు, సాంస్కృతిక, అవగాహన కార్యక్రమాల కోసం 200 మంది వరకు సామర్థ్యంతో ఓపెన్ ఎయిర్ యాంఫీథియేటర్‌ను కూడా నిర్మిస్తున్నారు. దివ్యాంగులకు అనుకూలంగా ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు.

శిక్షణ, వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్‌కు కేంద్రాలు

ఐఎంఎస్ భవనాలు ఏడాది పొడవునా మహిళా సంఘాల శిక్షణ, సామర్థ్య పెంపు కార్యక్రమాలకు వేదికలుగా పనిచేయనున్నాయి. నాయకత్వ నైపుణ్యాలు, జీవనోపాధులు, వ్యాపార నిర్వహణ, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ప్రభుత్వ విభాగాల సమావేశాలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎగ్జిబిషన్లు, మేళాలు, అమ్మకం కొనుగోలు దారుల స‌మావేశాలు, అనుభవాలు పరస్పర పంచుకునే కార్యక్రమాలు కూడా ఈ భవనాల్లో నిర్వహించనున్నారు.

ప్రతి భవనంలో ‘వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్’
ప్రతి ఇందిరా మహిళా శక్తి భవనంలో ‘వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార సలహాలు, ప్రాజెక్టు నివేదికల తయారీ, రిజిస్ట్రేషన్, లైసెన్సులు, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు రుణ అనుసంధానం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ-కామర్స్, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఆలోచన నుంచి కార్యరూపం దాల్చే వరకు అవసరమైన  మార్గదర్శ నం, చేయూత అందించేలా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. దీంతో మహిళా సంఘాల సభ్యులకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు, తమ ఉత్పత్తులను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు అవసరమైన సహకారం ఒకే చోట లభించనుంది.

ఉత్పత్తిదారులు, వ్యాపారవేత్తలుగా..

మహిళలను కేవలం పొదుపు సంఘాల సభ్యులుగా పరిమితం చేయకుండా, ఉత్పత్తిదారులు, వ్యాపారవేత్త లు, యజమానులు, ఆస్తుల సృష్టికర్తలుగా ఎదిగేలా చేయాలన్న ఇందిరా మహిళా శక్తి లక్ష్యానికి ఈ భవనాలు కీలక మౌలిక వసతులుగా మారనున్నాయి. మహిళా సంఘాలు, ఎఫ్‌పీవోలు, ఉత్పత్తిదారుల గ్రూపులు, మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసే ఉత్పత్తులకు శాశ్వత ప్రదర్శన, మార్కెటింగ్ వేదికను కల్పించనున్నారు. ఉత్పత్తులకు మెరుగైన గుర్తింపు, మార్కెట్ లభించేలా బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై కూడా సహకారం అందుతుంది.

గ్రామీణ‌ మహిళలకు సొంత వేదికలు

జిల్లాస్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలతోపాటు గ్రామ స్థాయిలోనూ మహిళా సంఘాలకు సొంత వేదికలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సమాఖ్య వ్యవస్థకు శాశ్వత వేదికలు కల్పిస్తోంది. ఇప్ప‌టికే 8 వేల గ్రామాల్లో వీవో భ‌వ‌నాల నిర్మాణం ఊపందుకుం ది. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, జీవనోపాధి కార్యకలా పాలకు స్థానికంగా అవసరమైన వసతులు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన వేదికలు : మంత్రి సీతక్క

మహిళా సంఘాలను కేవలం పొదుపు సంఘాలుగా కాక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి భవనాలు మహిళల కలలను సాకారం చేసే కేంద్రాలుగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళలకు శిక్షణ, వ్యాపార సలహాలు, బ్యాంకు రుణాలు, మార్కెట్ అవకాశాలు ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారు మరింత స్వయం సమృద్ధి సాధించేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. ‘మహిళల చేతుల్లో ఆర్థిక బలం ఉంటే కుటుంబం బలపడుతుంది.. కుటుంబాలు బలపడితే గ్రామాలు బలపడతాయి.. గ్రామాలు బలపడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఇందిరా మహిళా శక్తి భవనాలు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే బలమైన వేదికలుగా నిలుస్తాయి’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంఘాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం, ఆదాయ అవకాశాలను పెంచడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాస్థాయిలో నిర్మిస్తున్న ఐఎంఎస్ భవనాలు మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత చిరునామాగా మారడంతో పాటు మహిళా సాధికారతకు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని మంత్రి సీతక్క అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా వీటిని ప్రారంభించి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఆకట్టుకుంటున్న డ్రోన్ విజువల్స్

జిల్లా కేంద్రాల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న భవనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో భవనాల పూర్తి రూపం డ్రోన్ విజువల్స్ లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. విశాలమైన భవన సముదాయాలు, సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, ఉత్పత్తుల ప్రదర్శన–మార్కెటింగ్ ప్రాంతాలు, భోజనశాలలు, వసతి సదుపాయాలు, ఓపెన్ ఎయిర్ యాంఫీథియేటర్ వంటి ఆధునిక వసతులతో ఐఎంఎస్ భవనాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలకు శాశ్వత చిరునామాగా, శిక్షణ నుంచి వ్యాపారాభివృద్ధి వరకు, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సేవలకు కేంద్రాలుగా నిలిచేలా రూపుదిద్దుకుంటున్న ఈ భవనాల దృశ్యాలు ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ భవనాలు మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *