– సాంకేతికత నేర నియంత్రణకు సాధనం కావాలి
– సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల
– మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి
– సీసీటీఎనఎస్ డేటా నవీకరణ 96 శాతానికి
– అర్ధ వార్షిక నేర సమీక్షలో డీజీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరు, కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించాలని దిశా నిర్దేశం చేశారు. తన కార్యాలయంలో అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో అర్ధ వార్షిక వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇటీవలి కాలంలో సీసీటీఎన్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్ల గతంలో 70-80 శాతంగా ఉన్న డేటా అప్‌డేట్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో 96 శాతానికి చేరడం అభినందనీయమని అన్నారు. ప్రతి నెలా నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించాల్సిన ప్రాథమిక విధానాలను కచ్చితంగా అమలు చేయాలని, వృత్తిపరమైన ప్రమాణాలను పాటించడాన్ని అధికారులు పోటీగా తీసుకోవాలని సూచించారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీ జోన్ ఐజీలు ఇకపై ఇన్‌స్పెక్షన్ నోట్స్‌ను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాల పర్యటనలు, పోలీస్ స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి అవసరమైనచోట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
మాదకద్రవ్యాల కేసుల్లో 46.10% వృద్ధి, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల
రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య మూడేళ్లలో 7.15 శాతం పెరిగిందని, 2023-24లో 2,65,377 కేసులు నమోదు కాగా 2025-26లో 2,84,363కు చేరాయని తెలిపారు. లక్ష జనాభాకు నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగిందన్నారు. మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా 2025-26లో 2,960కు చేరాయని, మూడేళ్లలో 46.10 శాతం పెరుగుదల నమోదైందని అన్నారు. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కు పెరిగి 1,704 శాతం వృద్ధిని నమోదు చేశాయని, ట్రాఫిక్ నేరాలు 29,130 నుంచి 31,891కు పెరిగి 9.48 శాతం వృద్ధి చెందాయని, సైబర్ నేరాలు 25,373 నుంచి 22 వేలకు తగ్గి 13.29 శాతం, ఆర్థిక నేరాలు 37,690 నుంచి 32,684కు తగ్గి 13.28 శాతం క్షీణించాయని వివరించారు.
తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల
తీవ్ర నేరాలు(గ్రేవ్ క్రైమ్) గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. 2024-25లో 7,019 కేసులు నమోదు కాగా 2025-26లో 6,294కు తగ్గాయని, ఏడాది వ్యవధిలో 10.33 శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. లక్ష జనాభాకు నేరాల రేటు 11.21 నుంచి 10.88కు తగ్గిందన్నారు. ప్రధాన కమిషనరేట్లలో హైదరాబాద్‌లో 1,483 నుంచి 1,094కు తగ్గి 26.23 శాతం క్షీణత నమోదైందని, సైబరాబాద్‌లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయని వివరించారు. కొన్ని జిల్లాల్లో తీవ్ర నేరాలు పెరిగాయంటూ ములుగులో 44 నుంచి 88కు, నిర్మల్‌లో 66 నుంచి 102కు, ఆదిలాబాద్‌లో 96 నుంచి 140కు చేరాయన్నారు. చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయన్నారు.
సాధారణ నేరాలు పెరుగుతున్నాయ్
తీవ్ర నేరాలు తగ్గుతున్నప్పటికీ సాధారణ నేరాలు(నాన్-గ్రేవ్) మాత్రం పెరుగుతున్నాయన్నారు. 2023-24లో 2,59,201గా ఉన్న కేసులు 2025-26లో 2,78,069కు చేరాయని, మూడేళ్లలో 7.28 శాతం పెరుగుదల నమోదైందని డీజీపీ తెలిపారు. కమిషనరేట్లలో ఫ్యూచర్ సిటీలో 23.70 శాతం, సైబరాబాద్‌లో 17.32 శాతం, మల్కాజిగిరిలో 13.53 శాతం పెరుగుదల నమోదైందన్నారు. హైదరాబాద్‌లో మాత్రం 2.77 శాతం తగ్గుదల కనిపించిందన్నారు. జిల్లాల విషయానికి వస్తే కొమురం భీం ఆసిఫాబాద్‌లో 70.88 శాతం, ఆదిలాబాద్‌లో 60.71 శాతం పెరుగుదల నమోదైంది. మెదక్, సంగారెడ్డి, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లోనూ సాధారణ నేరాలు పెరిగాయని చెప్పారు.
మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా
నార్కోటిక్ కేసుల పెరుగుదల పోలీస్ శాఖకు ప్రధాన సవాలుగా మారుతోంది. 2023-24లో 2,026 కేసులు ఉండగా 2025-26లో 2,960కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగిందని, కమిషనరేట్లలో సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైందని, వరంగల్‌లోనూ మూడేళ్లలో 142.31 శాతం పెరిగాయని చెప్పారు. జిల్లాల్లో ఆదిలాబాద్‌లో 57 నుంచి 219కు కేసులు పెరిగాయని, నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరినట్లు, నిజామాబాద్‌లో 62 నుంచి 123కు పెరిగాయని, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైందని డీజీపీ వివరించారు. ఈ గణాంకల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లలో నార్కోటిక్ కేసులు 46.10% పెరుగుదల నమోదైనట్లు తెలిపారు.
మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు
2024-25లో 31,593గా ఉన్న మహిళలు, చిన్నారులపై నేరాలు 2025-26లో 31,108కు తగ్గాయన్నారు. ఏడాదిలో 1.54 శాతం క్షీణత నమోదైందని, 2023-24తో పోలిస్తే 3.81 శాతం ఎక్కువగా ఉన్నాయని డీజీపీ చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లలో కేసులు తగ్గగా ఫ్యూచర్ సిటీలో 790 నుంచి 994కు పెరిగాయన్నారు. జిల్లాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణపేట, ములుగులో పెరుగుదల కనిపించిందన్నారు.
ట్రాఫిక్ నేరాలు 9.48% పెరుగుదల
రాష్ట్రంలో ట్రాఫిక్ నేరాలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. 2023-24లో 29,130 కేసులు ఉండగా 2025-26లో 31,891కు చేరాయని, మూడేళ్లలో 9.48 శాతం పెరిగాయని తెలిపారు. సైబరాబాద్‌లో 2,882 నుంచి 3,677కు, మల్కాజిగిరిలో 3,213 నుంచి 3,673కు పెరగగా హైదరాబాద్‌లో స్వల్ప తగ్గుదల నమోదైనట్లు చెప్పారు. వరంగల్‌లో 8.27 శాతం తగ్గగా జిల్లాల్లో కొమురం భీం ఆసిఫాబాద్‌లో 154 నుంచి 1,115కు చేరి 624.03 శాతం పెరుగుదల నమోదైందని, నిర్మల్‌లో 67.92 శాతం, నల్గొండలో 34.37 శాతం, ఆదిలాబాద్‌లో 28.30 శాతం పెరిగాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్‌లో తగ్గుదల కనిపించిందన్నారు.
సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట
సైబర్ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29 శాతం తగ్గాయని డీజీపీ తెలిపారు. ఆర్థిక నేరాల్లోనూ 13.28 శాతం తగ్గుదల నమోదైందన్నారు. ఈ రెండు విభాగాల్లో మూడేళ్ల కాలానికి¡ తగ్గుదల కనిపించడం సానుకూల పరిణామంగా పోలీస్ శాఖ భావిస్తోంది. మొత్తంగా రాష్ట్ర నేరాల సరళిని పరిశీలిస్తే తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మాదక ద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ నేరాల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేరాలపై లోతైన విశ్లేషణ, నెలవారీ సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీజీపీ ఆనంద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ పోలీసింగ్ పోర్టళ్లలో సమాచారాన్ని నిర్ణీత గడువులోగా నవీకరించాలని అధికారులను ఆదేశించారు. సమయానుకూలంగా, కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేస్తున్న పోలీసు యూనిట్ల పనితీరును అభినందించారు. ఇతర యూనిట్లు కూడా ఇదే విధానాన్ని పాటించి పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. నేర నియంత్రణలో సాంకేతికత వినియోగంపై సమీక్షలో ప్రత్యేకంగా చర్చించారు. ఏఐ ఆధారిత పోలీసింగ్ అప్లికేషన్లు, సీసీటీఎన్‌ఎస్, టీజీ-కాప్, హాక్‌ఐ తదితర డిజిటల్ వేదికల పనితీరు, వినియోగంపై అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. కొత్త నేర చట్టాల(ఎన్‌సీఎల్) అమలు, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్(ఐసీజేఎస్), సైబర్ నేరాల నియంత్రణ చర్యలు, ఈగల్ కార్యకలాపాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్) పనితీరు, కేసుల భారంపైనా సమీక్షించారు. యువ ఐపీఎస్ అధికారులు పోలీసింగ్‌లో చేపట్టిన నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను వివరించారు. పోలీసు శాఖ ఆర్థిక, బడ్జెట్ అంశాలు, పోలీసు గృహ నిర్మాణ ప్రాజెక్టులు, మౌలిక వసతుల అవసరాలు, కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించిన అంశాలు, వారి పునరావాస చర్యలను కూడా సమీక్షించారు.
పోలీసు యూనిట్ల పనితీరుకు సంబంధించిన ఇతర అంశాలపైనా అధికారులు చర్చించారు. ఆయా యూనిట్లలో నెలకొన్న నేర పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యాలను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని డీజీపీ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలన్నారు. నేరాల నివారణ, ఛేదన, దర్యాప్తులో డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ స్పష్టం చేశారు. సమర్థమైన ప్రాథమిక పోలీసింగ్, సకాలంలో డేటా విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నిరంతర పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. యూనిట్ స్థాయిలో జవాబుదారీతనం, సకాలంలో నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో లక్షిత చర్యలు నేర నియంత్రణను మరింత బలోపేతం చేస్తాయన్నారు. డీజీపీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో డీజీ(లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, సీఐడీ డైరెక్టర్ శిఖా గోయెల్, ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డైరెక్టర్ చారు సిన్హా, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అన్ని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





