“చైనా ఉన్నత విద్య పరివర్తనాత్మక అనుభవం కొన్ని పాఠాలను అందిస్తుంది. కొంతౌజం సర్దా మరియు ఈ రచయిత కలిసి ‘ఇండియన్ పబ్లిక్ పాలసీ రివ్యూ’లో ప్రచురించనున్న ఒక పత్రం ప్రకారం, చైనాలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి మూడు దశాబ్దాలుగా అనుసరించిన ప్రభుత్వ విధానం ఫలితమేనని ఘంటాపథంగా చెబుతున్నారు. 2004లో, ‘అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’ ప్రపంచంలోని మొదటి 100 జాబితాలలో చైనా ప్రధాన భూభాగంలోని ఏ విశ్వవిద్యాలయం కూడా కనిపించలేదు..”
నీట్ పేపర్ లీక్ నిరసనల తర్వాత భారత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యా సంస్కరణలపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. తక్షణ సమస్య పరీక్షల సమగ్రత. కానీ, తన జాతీయ ఆకాంక్షలకు తగిన ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించడానికి భారతదేశానికి సంస్థాగత సామర్థ్యం ఉందా లేదా అన్నదే పెద్ద సమస్య. ఇటీవల ఒక వ్యాసంలో, రచయిత్రి, పాత్రికేయురాలు పల్లవి అయ్యర్, భారతదేశం , చైనాలను “పరీక్షల దేశాలు”గా అభివర్ణించారు. పెద్ద, అసమానతలున్న సమాజాలలో, పోటీతో కూడిన ప్రభుత్వ పరీక్ష మెరుగైన జీవితానికి ఒక మార్గం. పుట్టుక, సంపద, కులం, ప్రాంతం సంబంధాలను కృషి ద్వారా పాక్షికంగా అధిగమించవచ్చనేది ఆ హామీ. ఒక లీక్ అనేది నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీయడానికి కారణం ఇదే! ఈ సంవత్సరం 13.35 మిలియన్ల మంది విద్యార్థులు రాసిన చైనా పరీక్ష, గావోకావో, కేంద్ర ప్రభుత్వంచే రూపొందించబడి, రాష్ట్రాలచే నిర్వహించబడుతుంది. పరీక్ష పత్రాలు జీపీఎస్ ట్రాకింగ్, పోలీసుల భద్రత నడుమ తరలించబడటం, ప్రశ్నపత్రాలను తయారుచేసేవారిని సురక్షిత కేంద్రాలలో ఏకాంతంగా ఉంచడం, పరీక్షా హాళ్లలో ముఖ గుర్తింపు మరియు సిగ్నల్ జామ్మర్లను ఉపయోగించడం, మరియు పరీక్షల సమయంలో ఏఐ కంపెనీలు కొన్ని సాధనాలను నియంత్రించడం వంటి విషయాలను అయ్యర్ వివరించారు. ఈ యంత్రాంగం, పురోగతి అనేది పలుకుబడితో కాకుండా నియమాలతో నడుస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగిస్తుంది.
భారతదేశపు నీట్ సంక్షోభం రెండు ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటిది విధానపరమైనది. భారతదేశం అత్యంత కీలకమైన పరీక్షలను భద్రత, పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహించగలదా? పరీక్షా వ్యవస్థను సమూలంగా మార్చడానికి ప్రధానమంత్రి ఒక ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ప్రకటించారు. అయితే, పరీక్షల సమగ్రత అవసరమే కానీ, అది మాత్రమే సరిపోదు. దానికి కారణం రెండవ వ్యూహాత్మక ప్రశ్న. పరీక్ష స్వచ్ఛంగా ఉన్నప్పటికీ, అది ఎలాంటి ఉన్నత విద్యా వ్యవస్థకు దారితీస్తుంది? చైనా ఉన్నత విద్య పరివర్తనాత్మక అనుభవం కొన్ని పాఠాలను అందిస్తుంది. కొంతౌజం సర్దా మరియు ఈ రచయిత కలిసి ‘ఇండియన్ పబ్లిక్ పాలసీ రివ్యూ’లో ప్రచురించనున్న ఒక పత్రం ప్రకారం, చైనాలో విశ్వవిద్యాలయాల అభివృద్ధి మూడు దశాబ్దాలుగా అనుసరించిన ప్రభుత్వ విధానం ఫలితమేనని ఘంటాపథంగా చెబుతున్నారు. 2004లో, ‘అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్’ ప్రపంచంలోని మొదటి 100 జాబితాలలో చైనా ప్రధాన భూభాగంలోని ఏ విశ్వవిద్యాలయం కూడా కనిపించలేదు. 2025 నాటికి, సింఘువా మరియు పెకింగ్ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని అగ్రశ్రేణిలోకి ప్రవేశించాయి, మరియు కనీసం ఆరు చైనా విశ్వవిద్యాలయాలు మొదటి 100 జాబితాలలో నిలిచాయి.
భారతదేశానికి మొదటి పాఠం క్రమపద్ధతి. మన ఉన్నత విద్యకు పాఠశాల స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయుల నాణ్యతలో బలమైన పునాది అవసరం. చైనాలో, 9 సంవత్సరాల నిర్బంధ విద్య 2010 నాటికి సార్వత్రికమైంది, ఇది ఉన్నత విద్య కోసం పెద్ద సంఖ్యలో అర్హతగల విద్యార్థులను అందించింది. రెండవ పాఠం ఏకాగ్రత. ప్రాజెక్ట్ 211, ప్రాజెక్ట్ 985 మరియు తరువాత దాని డబుల్ ఫస్ట్-క్లాస్ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలు మరియు విభాగాలపై చైనా తన వనరులను కేంద్రీకరించింది. ప్రాజెక్ట్ 985 కేవలం తొమ్మిది విశ్వవిద్యాలయాలతో ప్రారంభమై, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్ మరియు టోక్యోలతో పోటీ పడాలనే స్పష్టమైన లక్ష్యంతో తరువాత 39కి విస్తరించింది. 2009 మరియు 2013 మధ్య, ప్రాజెక్ట్ 985 విశ్వవిద్యాలయాలు చైనా విశ్వవిద్యాలయ విద్యార్థులలో 5% కన్నా తక్కువ మందిని చేర్చుకున్నప్పటికీ, జాతీయ పరిశోధన నిధులలో సుమారు 70% పొందాయి.ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. భారతదేశ సమస్య నిధుల కొరత. ఇది ‘లోతు లేని విస్తృతి’కి దారితీస్తుంది. ఏఎస్ పీఐ పర్యవేక్షించే 74 కీలక సాంకేతికతలలో సుమారు 50 రంగాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో ఒకటిగా కనిపిస్తున్నప్పటికీ, దేనిలోనూ అగ్రగామిగా లేదు. మనకు విస్తృతమైన విద్యా వ్యవస్థ అవసరమైనప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, బయోటెక్, మెటీరియల్స్ సైన్స్, ఎనర్జీ స్టోరేజ్, వ్యవసాయం మరియు క్లైమేట్ టెక్నాలజీ వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల కొన్ని సంస్థలు కూడా అవసరం.
మూడవ పాఠం పనితీరు ఆధారిత స్వయంప్రతిపత్తి. నిధులు ఫలితాలు, ఆవర్తన సమీక్ష మరియు హోదా తగ్గింపు అవకాశంతో ముడిపడి ఉంటాయి. ఉన్నత హోదా శాశ్వత హక్కుగా మారిన చైనా వ్యవస్థలో డబుల్ ఫస్ట్-క్లాస్ కార్యక్రమం పోటీని ప్రవేశపెట్టింది. భారతీయ విశ్వవిద్యాలయాలకు కూడా నిత్యం జరిగే అధికారిక నియంత్రణల నుండి స్వయంప్రతిపత్తి అవసరం. కానీ ఆ స్వయంప్రతిపత్తితో పాటు అభ్యసన ఫలితాలు, పరిశోధన నాణ్యత, పరిపాలన మరియు ఉపాధి అవకాశాల విషయంలో జవాబుదారీతనం కూడా ఉండాలి. నాల్గవ పాఠం జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం. చైనాలోని ఉన్నత విశ్వవిద్యాలయాలు పారిశ్రామిక సమూహాలు మరియు టెక్నాలజీ మిషన్లతో అనుసంధానించబడ్డాయి. ఇది కీలక సాంకేతికతలలో దాని బలానికి దోహదపడింది. ఐదవ పాఠం పాఠ్యప్రణాళికలో చురుకుదనం.
2025లో, చైనా విద్యా మంత్రిత్వ శాఖ 2025-27 మధ్యకాలంలో విద్యా విభాగాలను మరియు ప్రధాన కోర్సులను సర్దుబాటు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఇది సరికొత్త సాంకేతికతలలో కొత్త విభాగాలను, బలహీనమైన డిమాండ్ లేదా నాణ్యత తగ్గుతున్న కార్యక్రమాల సంస్కరణను, బలమైన అంతర్విభాగాల సమైక్యతను, విద్యా విషయాలలో ఏఐ సాధనాల చేరికను, ఉపాధ్యాయుల సామర్థ్య పెంపును మరియు పరిశ్రమ-విశ్వవిద్యాలయాల మధ్య సన్నిహిత సహకారాన్ని ఆశిస్తుంది. ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ సమావేశం ఏఐ అక్షరాస్యత, ప్రత్యేక ఏఐ కోర్సులు మరియు పాఠ్యప్రణాళిక రూపకల్పన , బోధనలో ఏఐ వినియోగానికి ప్రాధాన్యతనిచ్చింది. భారతీయ విశ్వవిద్యాలయాలు కమిటీలు, ఆమోదాలు మరియు పాతబడిన సిలబస్లతో నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. ఏఐ, బయోటెక్, రోబోటిక్స్, వాతావరణ మార్పుల ప్రమాదం మరియు భౌగోళిక రాజకీయ సరఫరా గొలుసులో మార్పులున్న ఈ యుగంలో, కోర్సులు నిరంతరం మారవలసి ఉంటుంది.
చైనా కేంద్రీకృత వ్యవస్థకు తీవ్రమైన పరిమితులు ఉన్నాయి. విద్యా స్వేచ్ఛపై ఆంక్షలు, పరిశోధన సమగ్రతపై ఆందోళనలు మరియు ప్రాంతీయ అసమానతల వంటివి ఈ పరిమితులు. కానీ భారతదేశం దాని వ్యూహాత్మక స్పష్టత నుండి నేర్చుకోగలదు. భారతదేశం ఏం చేయాలి? మొదటిది, పరీక్షల సమగ్రతను కాపాడాలి; నమ్మకం లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది. రెండవది, పరీక్షల సంస్కరణలను తక్షణమే అమలు చేయాలి. మూడవది, దీర్ఘకాలిక, లోతైన పెట్టుబడుల కోసం 50-100 విశ్వవిద్యాలయాలను మరియు విభాగాలను గుర్తించాలి. నాలుగవది, నియామకాలు, పాఠ్యప్రణాళిక, సహకారం మరియు పరిశోధన భాగస్వామ్యాలలో వాటికి స్వయంప్రతిపత్తిని ఇవ్వాలి. ఐదవది, విశ్వవిద్యాలయాలను స్థానిక ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానించి, వికేంద్రీకరణను బలోపేతం చేయాలి. ఆరవది, ప్రతి ప్రతిష్టాత్మక డిగ్రీలో ఏఐ, డేటా మరియు అంతర్విభాగ సమస్య-పరిష్కారాన్ని ఒక భాగంగా చేయాలి. విధానం వ్యూహాత్మకంగా, సహనంతో మరియు గంభీరంగా ఉన్నప్పుడు పరివర్తన సాధ్యమవుతుందని చైనా ఉదాహరణ చూపిస్తుంది.
-అజిత్ రనదే
“మింట్” సౌజన్యం తో




