“ఎగువ రాష్ట్రాలకు భిన్నంగా జూరాలకు 9 టియంసిలు ఆర్డీయస్ కుడి కాలువకు 4 టియంసిలు తెలుగు గంగకు 25 టియంసిలు కేటాయించింది. అదే సమయంలో ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు అనుమతించి ఏకంగా 130 టియంసిలు అదనంగా కేటాయించింది. ఆల్మట్టి రిజర్వాయర్ నిర్మాణం తర్వాత వర్షాకాలం ప్రారంభమైనా ఆగష్టు తొలి వారంలో గాని వరద కిందకు రావడం లేదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013 తీర్పు అమలు జరిగితే అనూహ్యమైన పరిస్థితిని రెండు రాష్ట్రాల ఎదుర్కొన వలసి వుంటుంది. మొదలే కృష్ణలో నీటి ఎద్దడి వుంది. ఈ తీర్పు అమలు జరిగితే 285 టియంసిలు ( 177*81)ఎగువ రాష్ట్రాలు వాడుకొంటాయి. అంతేకాదు. ఈ తీర్పు అమలు జరిగిన తర్వాత కృష్ణ యాజమాన్య బోర్డు ఉనికి ఏమౌతుందో తెలియదు. కృష్ణ వాటర్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ తన తీర్పులో పొందు పర్చి వుంది..”
2000 సంవత్సరంతో బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి ముగిసిన తర్వాత కృష్ణ నదీ లోయలోని రాష్ట్రాల మధ్య నీటి వాటాలు పంపిణీకి 2004 లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. . ఈ ట్రిబ్యునల్ 2010 లో మధ్యంతర తీర్పు ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్ట దాయకంగా వుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2011 సెప్టెంబర్ లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు తమ వాదనను ట్రిబ్యునల్ కే వివరించాలని తెలిపింది. స్టే ఇవ్వ లేదు. అయితే ట్రిబ్యునల్ 2013 లో తుది తీర్పు వెలువరించినా తొలి తీర్పులో ఎట్టి మార్పులు చేయ లేదు. తదనంతరం తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే మంజూరు చేసింది.
ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. 1956 అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం కింద నియమింప బడే ఏ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులనైనా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ చేస్తేనే అమలు లోనికి వస్తాయి. తదుపరి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొనే అవకాశం వుండదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఈ రోజుకు ఆలాగే వుంది. ఫలితంగానే కృష్ణ బేసిన్ లో ఈ రోజుకూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో వుంది. బ్రిటీష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాలకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టదాయకంగా వుంది.
గత మూడు నాలుగైదు ఏళ్లు గా మహారాష్ట్ర కర్నాటక రాష్ట్రాలు సుప్రీంకోర్టులో స్టే రద్దు చేయించి ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయించుకొనేందుకు విఫల యత్నాలు చేస్తున్నాయి. కర్నాటక లో బిజెపి ప్రభుత్వం వున్నపుడు చేయని ప్రయత్నం లేదు. ఇటీవల కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ బేసిన్ లోని రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు బయట ఒప్పందం కుదర్చాలని రెండు దఫాలు విఫల యత్నాలు చేశారు. తాజాగా గత నెలలో కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో విచారణకు గట్టి ప్రయత్నం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ సెప్టెంబర్ నెలలో విచారణకు వచ్చునట్లు చేస్తానని కర్నాటక కు తెలియ జేశారు.
ఇందులో మరో ట్విస్ట్ వుంది. 2010 లో ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు ఇచ్చిన తర్వాత కర్నాటక ప్రభుత్వం 23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలువలు తవ్విందని కనీసం తుది తీర్పుకు లోబడి ప్రస్తుతం ఈ కాలువలు ఉపయోగించుకొనేందుకు తాత్కాలిక అనుమతి ఇవ్వాలని కర్నాటక అడ్వెకేట్ సుప్రీంకోర్టును కోరి వున్నారు. సెప్టెంబర్ సగ భాగం గడిచినా ఈ కేసు విచారణకు రాలేదు. నెలాఖరులో గాని వచ్చే నెలలో నైనా విచారణకు రావచ్చు. దురదృష్టం కొద్దీ సుప్రీంకోర్టు స్టే ఎత్తి వేస్తే తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతాయి. కొత్త కేటాయింపులు లేక పోగా మొదలే నీటి ఎద్దడితో వుండే కృష్ణ నది నుండి 285 టియంసిల నీరు కర్నాటక మహారాష్ట్రలు తన్నుకు పోతాయి.మరో ప్రమాదకరమైన అంశమేమంటే కృష్ణలో చుక్క మిగులు నీరు లేకుండా అన్ని రాష్ట్రాల మధ్య బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. ఈ అంశం ప్రధానంగా దిగువ రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లకు తీవ్ర అపకారం చేస్తుంది. సాధారణంగా ఏ ట్రిబ్యునల్ గాని లేదా ఏ నదిలో నైనా నీటి లభ్యత అంచనా వేసే సమయంలో 75 శాతం నీటి లభ్యత తీసుకొంటారు. కానీ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం నీటి లభ్యత అంచనా వేశారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు వున్నా ఈ విషయంలో సమైక్యంగా పోరాడ వలసి వుంది. లేకుంటే ఇరువురు నష్ట పోతారు.
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అసంబద్ధ తీర్పులోని కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అపకారం చేసే విధంగా వుంది. కర్నాటకకు 65 శాతం నీటి లభ్యత కింద 65 టియంసిలు సరాసరి కింద 105 టియంసిలు ఆవిరి నష్టం కింద 7 టియంసిలు మొత్తం 177 టియంసిలు కేటాయించారు. అంతే కాకుండా ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుండి 524.256 మీటర్లకు ఎత్తు పెంచుకోవడమే కాకుండా అదనంగా 130 టియంసిలు నిల్వ కు అనుమతి ఇచ్చారు. మహారాష్ట్ర కు 65 శాతం నీటి లభ్యత కింద 43 టియంసిలు సరాసరి కింద 35 టియంసిలు ఆవిరి నష్టం కింద మూడు టియంసిలు మొత్తం 81 టియంసిలు కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికొచ్చే సరికి తోక కోసి సున్నం పెట్టారు. 65 శాతం నీటి లభ్యత కింద కింద 42 టియంసిలు సరాసరి కింద 145 టియంసిలు ఆవిరి నష్టం కింద ఆరు టియంసిలు మొత్తం 194 టియంసిలు కేటాయించారు.
గణాంకాల్లో ఆంధ్ర ప్రదేశ్ కు భారీగా కేటాయింపులున్నా ఎందుకూ కొరగాని మేక చన్నులులాగా రిజర్వాయర్ ల్లో క్యారీ ఓవర్ కింద 150 టియంసిలు కేటాయించారు. బచావత్ ట్రిబ్యునల్ కూడా క్యారీ ఓవర్ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 150 టియంసిలు కేటాయించింది. కాని గత సాగునీటి చరిత్ర తిరగేస్తే ఏ నాడు ఏ పార్టీ ప్రభుత్వమూ క్యారీ ఓవర్ కింద నీళ్లు నిలువ చేయ లేదు. అంతెందుకు? గత సంవత్సరం శ్రీ శైలం జలాశయానికి రెండు వేల టియంసిలకు పైగా వరద వచ్చింది. అదే సమయంలో ప్రకారం బ్యారేజీ నుండి కిందకు దాదాపు 800 టియంసిలు సముద్రం పాలయ్యాయి. ఇప్పుడు శ్రీ శైలం జలాశయంలో నీళ్ల గురించి రెండు రాష్ట్రాల పోట్లాడుకొంటున్నాయ్
ఎగువ రాష్ట్రాలకు భిన్నంగా జూరాలకు 9 టియంసిలు ఆర్డీయస్ కుడి కాలువకు 4 టియంసిలు తెలుగు గంగకు 25 టియంసిలు కేటాయించింది. అదే సమయంలో ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు అనుమతించి ఏకంగా 130 టియంసిలు అదనంగా కేటాయించింది. ఆల్మట్టి రిజర్వాయర్ నిర్మాణం తర్వాత వర్షాకాలం ప్రారంభమైనా ఆగష్టు తొలి వారంలో గాని వరద కిందకు రావడం లేదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013 తీర్పు అమలు జరిగితే అనూహ్యమైన పరిస్థితిని రెండు రాష్ట్రాల ఎదుర్కొన వలసి వుంటుంది. మొదలే కృష్ణలో నీటి ఎద్దడి వుంది. ఈ తీర్పు అమలు జరిగితే 285 టియంసిలు ( 177*81)ఎగువ రాష్ట్రాలు వాడుకొంటాయి. అంతేకాదు. ఈ తీర్పు అమలు జరిగిన తర్వాత కృష్ణ యాజమాన్య బోర్డు ఉనికి ఏమౌతుందో తెలియదు. కృష్ణ వాటర్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ తన తీర్పులో పొందు పర్చి వుంది.





