కోదాడ జాబ్ మేలా కొత్త ఆశాకిరణం

– రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేలాలు నిర్వహించాలి
– యువత ఉద్యోగార్థులుగా కాక ఉపాధి ప్రదాతలుగా ఎదగాలి
– శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్
కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారతీయ యువతకు ఉద్యోగావకాశాలు క్రమంగా తగ్గుతున్న వేళ సుమారు 350 కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కోదాడ మెగా జాబ్ మేలా తెలంగాణ నిరుద్యోగ యువతకు కొత్త ఆశాకిరణంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కోదాడలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేలాలో వేలాదిమంది ఉద్యోగార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు పొందడం రోజురోజుకూ కష్టంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 350 కంపెనీలను కోదాడకు తీసుకురావడం అసాధారణమైన విజయమని ఆయన కొనియాడారు. తాను దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలుగా రాజకీయ, ప్రజాజీవితంలో ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన ఉద్యోగ మేలాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది ఒక్క రోజు కార్యక్రమంగా మిగిలిపోకూడదని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి జాబ్ మేళాలు నిరంతరం నిర్వహించి అర్హత కలిగిన యువతను నేరుగా ప్రముఖ సంస్థలతో అనుసంధానం చేయాలని సూచించారు. ఇది ఉద్యోగ నియామక కార్యక్రమం మాత్రమే కాదని, వేలాదిమంది యువత జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది అని స్పీకర్ అభివర్ణించారు. ఒక్క ఉద్యోగం ఒక వ్యక్తి జీవితాన్నే కాక ఆ కుటుంబం మొత్తానికి భరోసానిస్తుందన్నారు. నిరుద్యోగ యువత కలలను ప్రజా ప్రభుత్వం తప్పకుండా సాకారం చేస్తుందని స్పష్టం చేశారు. సుమారు 350 కంపెనీల భాగస్వామ్యంతో కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా హుజూర్‌నగర్‌ జాబ్ మేళా కంటే భారీ స్థాయిలో జరుగుతోందన్నారు. ఇంటర్వ్యూలంటే భయపడవద్దని, తొలి ప్రయత్నంలో ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహానికి గురికావద్దని అభ్యర్థులకు సూచించారు. ఈరోజు పొందిన ఇంటర్వ్యూ అనుభవం రేపటి విజయానికి పునాది అవుతుందన్నారు. ఒక కంపెనీ అవకాశం ఇవ్వకపోతే మరో కంపెనీ మీ ప్రతిభను గుర్తించేందుకు సిద్ధంగా ఉండొచ్చని యువతలో ధైర్యం నింపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాక ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం విస్తృత లక్ష్యమని వివరించారు. కృత్రిమ మేధతోపాటు సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకనుగుణంగా యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ‘ఈరోజు మీరు ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు. రేపు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి’ అని ఉద్బోధించారు. ఇంత భారీ ఉద్యోగ మేళాను నిర్వహించిన నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డిని స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు.
కోదాడకు పోటెత్తిన యువత
– మెగా జాబ్ మేళాలో ఉద్యోగాలకు 5,620మంది షార్ట్‌లిస్ట్ 
– తొలి రెండు గంటల్లోనే 700 మందికి ఉద్యోగాలు
అన్ని దారులూ కోదాడ వైపే అన్నట్లుగా వేలాదిమంది యువత కోదాడలో శనివారం జరిగిన మెగా జాబ్ మేళాకు తరలివచ్చారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఉద్యోగార్థులతో పట్టణం కిక్కిరిసిపోయింది. వివిధ రంగాలకు చెందిన 350 కంపెనీలు మొత్తం 5,620 మంది అభ్యర్థులను ఉద్యోగాలకు షార్ట్‌లిస్ట్ చేశాయి. వీరిలో 3,500 మందికిపైగా ఉద్యోగాలు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనా. 22 వేల మందికి పైగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా కార్యక్రమ ప్రాంగణంలో మరో పదివేల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 32 వేలు దాటింది. ఈ అపూర్వ స్పందనతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన రాష్ట్రంలోని అతిపెద్ద నియామక కార్యక్రమాల్లో ఒకటిగా కోదాడ మెగా జాబ్ మేళా నిలిచింది. జాబ్ మేళా ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా యువత ఉద్యోగాలు సాధించారు. ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయిన వెంటనే పలువురు అభ్యర్థులకు కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు. ఫాక్స్‌కాన్, ఎలఅండ్‌టీ, ఎంఐఏఎల్, మహీంద్రా, టాటా, అరవింద్, ఎంఎసఎన్, మెట్రో, గూగుల్, ఇండిగో, అపోలో, మెడ్‌ప్లస్‌తోపాటు అనేక ప్రముఖ, వర్ధమాన సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. ఉద్యోగార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సులభంగా గుర్తించేందుకు జాబ్ మేళా ప్రాంగణంతోపాటు అధికారిక వెబ్‌సైట్‌లోనూ పాల్గొన్న కంపెనీల లోగోలను ప్రదర్శించారు. ఎల్‌అండ్‌టీ ఒక్కటే 40 మంది యువకులను ఎంపిక చేసి సగటున నెలకు రూ.21 వేల వేతనం అందించనున్నట్లు తెలిపింది. ఇతర కంపెనీల ప్రతినిధులు కూడా రోజంతా ఇంటర్వ్యూలు నిర్వహించి సాంకేతిక, సాంకేతికేతర ఉద్యోగాలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. విమానయానం, అనుబంధ సేవల్లో ఉద్యోగాలు కోరుకునే యువత ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రాంతంలో పెద్దఎత్తున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఇండిగో సంస్థ ప్రతినిధులు సూచించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి జాబ్ మేళాను సందర్శించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు వారి సొంత ప్రాంతానికి దగ్గరలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన కంపెనీలను ప్రశంసించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు వచ్చిన అపూర్వ స్పందన గ్రామీణ యువత ఆకాంక్షలకు, వారిలోని అపార సామర్థ్యానికి నిదర్శనమన్నారు. అర్హత కలిగిన ఉద్యోగార్థులు, ప్రముఖ కంపెనీల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, ఉద్యోగ అవకాశాలను యువత ఇంటి ముంగిటకే తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణమైన కంపెనీల స్టాళ్లను సందర్శిస్తూ స్క్రీనింగ్ పరీక్షలు, సాంకేతిక పరీక్షలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఒకే అభ్యర్థి పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలను పరిశీలించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంపెనీలు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాలు పొందే అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *