– 22ఎ నిషేధిత జాబితా పేరుతో దోపిడీకి స్కెచ్
- రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఎంపీ ఈటల
- రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డ ఎంపీ ఈటల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18: బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ రెండింతలు పెరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మంగళవారం ఆయన కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన భూములు, పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాలు, చివరకు ప్రభుత్వమే లేఅవుట్లు వేసి విక్రయించిన భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం వెనుక భూ మాఫియాకు అప్పగించే కుట్ర ఉందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసినప్పటికీ భూములను లాక్కునే ప్రభుత్వాల విధానంలో ఎలాంటి మార్పు రాలేదని ఈటల విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం భూ దందాలకు పాల్పడితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదే భూములను సెటిల్‌మెంట్ చేసుకుంటోందని ఆరోపించారు. గతంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖర్చు చేసిన డబ్బులు ఇలాంటి భూ దందాల ద్వారా వచ్చినవేనంటూ ఈటల సంచలన ఆరోపణలు చేశారు. గల్ఫ్ ఆయిల్ కంపెనీకి చెందిన భూములు ఫీనిక్స్ కంపెనీ ద్వారా ఎలా చేతులు మారాయో అందరికీ తెలుసని అన్నారు. ఈ వ్యవహారాల్లో పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పేదలు, రైతులకు అన్యాయం చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియాలకు కొమ్ముకాయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూ అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఈటల స్పష్టం చేశారు.
———————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





