– ప్రధాని నోట మాట.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం
న్యూఢిల్లీ, ఆగస్టు 18 : కాక్రోచెస్ అంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు వచ్చింది. ఇటీవల దిల్లీ జంతర్‌మంతర్ వద్ద తన సత్తా చాటింది. ఇప్ప్పుడు ఇలాంటిదే మరో పార్టీ పుట్టుకొచ్చింది. సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని, దిమాగీ నక్సల్స్ మాత్రం మిగిలారంటూ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా కొత్త పార్టీ పుట్టుకు వచ్చింది. మోదీ ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే దిమాగీ నక్సల్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో తెరిచిన పార్టీ ఖాతాలకు అనూహ్య ఆదరణ లభించింది. ఇన్‌స్టాలో 1.81 లక్షలమంది, ఎక్స్‌లో 7000 మంది ఆ ఖాతాలను అనుసరించారు. ఇన్‌స్టాలో దిమాగి నక్సల్ జనతా పార్టీ అనే పేరుతో ఖాతాలు తెరిచారు. యువత ప్రశ్నించడమే కాదు, సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా వెతకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐఐటీ దిల్లీ 57వ స్నాతకోత్సవంలో చేసిన వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా యువత ప్రశ్నిస్తూనే ఉంది. సమస్యలకు పరిష్కరం చూపాలని ప్రధాని మోదీ అనడం చూస్తుంటే పాలకులు ఎందుకన్న ప్రశ్న ఉదయిస్తోంది. నిజానికి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్న పాలకులదా కాదా అన్నది తేల్చాలి. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్ప్పుడు యువతకు ఎన్నో ఆశలు కల్పించింది. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగం విస్తరణ, పెట్టుబడుల పెంపు, అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని వెనక్కి రప్పించడం వంటి అంశాలపై ఎన్నో హావిÖలు ఇచ్చారు. అవన్నీ మరచిపోవడం మోదీకి తగదు. ఇవన్నీ పక్కనపెట్టి దిమాగీ నక్సల్స్ అని మేధావులను దూషించడం కూడా సరికాదు. ఇప్పటివరకు యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే చెప్పలేం. ఆందోళనలు చేస్తున్న యువతను చూసైనా పాలకులు కళ్లు తెరవాలి. పేపర్ లీకేజీలతో విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడం వల్లనే కదా యువత ఆందోళన బాట పట్టింది. ‘నీట’ వివాదం ఈ పరిస్థితికి ఒక ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు నెలలతరబడి ఆందోళనలు చేస్తే వారి సమస్యలను వినడం, విచారణ జరిపించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వంటి పనులను ప్రభుత్వం చేయడంలేదు. పైగా నిరసనకారులకు పరిష్కారం విÖరే చూపండి అని చెప్పడం ద్వారా ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారో మోదీ చెప్పాలి. నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వం పాలనా బాధ్యతలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉంది. పరిష్కారం చూపాలంటే ముందు యువతకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలి. నిజానికి యువత కోరుతున్నది కూడా ఈ దేశ అభివృద్ధిలో తమను కూడా భాగస్వాముల్ని చేయమని, తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమని అంటున్నారు. తద్వారా వికసిత భారత్‌లో తమను కూడా భాగస్వాములను చేయమంటున్నారు. ఇవి ఏవీ జరగకుండా అన్నింటికీ దూరంగా ఉంచడం వల్ల అభివృద్ధి ఎలా జరుగుతుందని అనుకుంటున్నారో వివరించాలి. యువత ప్రశ్నలు ‘నీట’కే పరిమితం కావాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న విదేశీ అప్ప్పు, ధరలు, నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు, పరిపాలనలో జవాబుదారీతనం, రాజకీయ ఫిరాయింపులు, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల వ్యవస్థ వంటి కీలక సంస్థల స్వతంత్రతపై వ్యక్తమవుతున్న సందేహాలు.. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అంశాలే. అయితే ప్రభుత్వం తన అధికారాన్ని ప్రశ్నను అణచడానికి కాక సమస్యను పరిష్కరించడానికి వినియోగిస్తే అసలు సమస్యే ఉండదు. కానీ ప్రభుత్వ ధోరణి అలా కనిపించడం లేదు. యువత పరిష్కారాలు చూపాలి, అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అంటే కుదరదు. అందుకే దిమాగీ నక్సల్ అనగానే పార్టీ పుట్టుకు వచ్చింది. ఇది ఓ రకంగా ప్రశ్నించడానికే అనుకోవాలి. ప్రశ్నలకు నాయకులు పరిష్కారాలు చూపించడానికి సిద్ధంగా ఉండాలి.
నేను కూడా దిమాగీ నక్సలైట్‌నే : కేజ్రీవాల్ 

ప్రశ్నించే వారంతా దిమాగీ నక్సల్స్ అంటూ తాజాగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే చిదంబరం తదితరులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా మోదీ వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిమాగీ నక్సల్స్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన కేజీవ్రాల్ తను దిమాగీ నక్సల్ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తాను నిజమైన దేశ భక్తుడినని, బీజేపీకి భయపడేవాడిని కాదని అన్నారు. ‘ఎవరైతే బీజేపీకి భయపడకుండా ప్రశ్నిస్తారో వాళ్లంతా మోదీ దృష్టిలో దిమాగీ నక్సల్స్.. ఒకవేళ భగత్ సింగ్, అంబేద్కర్ ఇప్పటికీ బతికే ఉంటే వాళ్లను కూడా ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్ అనేవారేమోనని’ మండిపడ్డారు. జవాబుదారీ వ్యవస్థ, అవినీతి లేని సమాజం, ప్రజలకు సౌకర్యాలు, హాస్పిటల్స్ స్కూల్స్, డ్రైనేజీ సిస్టమ్ మొదలైన వాటిపై ప్రశ్నించే వారు మోదీ దృష్టిలో దిమాగీ నక్సల్సేనా అని ప్రశ్నించారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



