– నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమికి ఎసరు
– ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
మేడ్చల్, ప్రజాతంత్ర, మే 29:ఫేక్ జీవోలు, అక్రమ భూ ఒప్పందాల ద్వారా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌లను పోలీసులు అరెస్టు చేయగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గండిపేట సర్వే నెం.18లోని ప్రభుత్వ భూమిపై నిందితులు నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని తమదిగా చూపి ఫేక్ జీవోలు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఈ నకిలీ జీవోలను వైరల్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రభుత్వం భూమిని క్రమబద్ధీకరించినట్లు చెబుతూ ఐదు ఫేక్ జీవోలను సృష్టించిన నిందితులు ఆ భూమిని ఎకరాకు రూ.3.5 కోట్లకు అమ్మేందుకు కుట్ర చేసినట్లు సమాచారం ఉందన్నారు. బొల్లా రమేష్, బ్రహ్మనాయుడుతో ఇందుకు ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో బయటపడిందని, బ్రహ్మనాయుడుకు నిమ్మల కుటుంబం నుండి రెండు విడతలుగా డబ్బు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి రూ.కోటి, మరోసారి రూ.25 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. మొత్తం భూ లావాదేవీల్లో సుమారు రూ.4 కోట్లు చేతులు మారినట్లు దర్యాప్తులో తేలింది. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. చట్టబద్ధ హక్కులు లేకపోయినా ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు ఉన్నట్లు చూపే ప్రయత్నం చేశారన్నారు. హైకోర్టులో తమ భూమే అని నిందితులు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ అక్టోబర్ 2025లో వాటిని కోర్టు కొట్టివేసినట్లు తెలిపారు. అనంతరం కూడా అక్రమంగా భూమి అమ్మకానికి ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు. ఫేక్ జీవోలు, ఫోర్జరీ పత్రాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. భూమి కొనుగోలు చేసే ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



