– ఉద్యోగులకు తొలి విడత రూ.2,000 కోట్ల బకాయిల విడుదల
~ 100 రోజుల్లో రూ. 6,000 కోట్ల చెల్లింపుల హామీ
~ రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్
~ మే 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నీ చెల్లింపు
~ మిగిలిన రూ.4,000 కోట్ల విడుదలపై ఆర్థిక శాఖ కసరత్తు
~హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు
~హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం వంద రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఉద్యోగ జేఏసీ నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం తొలి విడతగా రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం వంద శాతం క్లియర్ చేయగా వీరికి సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి శరవేగంగా కసరత్తు జరుగుతోంది అని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ శ్రద్ధ, శరవేగ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





