– 40 వేల మందికిపైగా సందర్శకులు
– రూ.30 లక్షలకు పైగా విక్రయాలు
– మహిళా సంఘాల ఉత్పత్తులకు విశేష ఆదరణ
– వ్యాపారావకాశాలపై అవగాహనకు మండల సమాఖ్య అధ్యక్షుల ప్రత్యేక సందర్శన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన గ్రామీణ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేళా ‘ సారస్’ నాలుగో రోజూ సందర్శకులతో కిటకిటలాడింది. ప్రారంభ రోజు నుంచి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు విక్రయాలు కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. నాలుగో రోజు నాటికి మేళాను సందర్శించిన వారి సంఖ్య 40 వేలు దాటగా మొత్తం విక్రయాలు రూ.30 లక్షలకు మించాయి. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ గ్రామీణ మహిళల వ్యాపార సామర్థ్యానికి, వారి ఉత్పత్తుల నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.
తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు.. హస్తకళలకు ప్రత్యేక ఆకర్షణ
మేలాలో తెలంగాణ సంప్రదాయ చేనేత వస్త్రాలు, హస్తకళలు, గృహోపకరణాలు, పచ్చళ్లు, చిరుతిండ్లు, చిరుధాన్య ఉత్పత్తులు, ఇతర గ్రామీణ ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా సంఘాల ఉత్పత్తులకు కూడా మంచి గిరాకీ లభిస్తోంది. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయ కళలు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తులను ఒకే వేదికపై కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో కుటుంబాలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు మేళాకు తరలివస్తున్నారు. మహిళలు తమ ఇళ్ల వద్ద, గ్రామాల్లో తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా సారస్ మేళా వారికి మంచి మార్కెటింగ్ వేదికగా నిలుస్తోంది. మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ ఉత్పత్తులకు తగిన ధర పొందేందుకు, వినియోగదారుల అభిరుచులను తెలుసుకునేందుకు ఈ మేళా దోహదపడుతోంది.
మండల సమాఖ్య అధ్యక్షుల ప్రత్యేక సందర్శన
మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మండల సమాఖ్య అధ్యక్షుల కోసం ప్రత్యేక సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ స్టాళ్లను సందర్శించిన వారు మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, వాటి నాణ్యత, ధరలు, ప్యాకేజింగ్, విక్రయ పద్ధతులను పరిశీలించే అవకాశం కల్పించారు. విస్తృతమైన మార్కెట్‌ను ఎలా అందిపుచ్చుకోవాలి.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలి.. ఉత్పత్తులకు మెరుగైన ధర ఎలా పొందాలి.. వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించుకోవాలి అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ సందర్శన ఉపయోగపడనుంది. మహిళా సంఘాల నాయకత్వానికి వ్యాపార నిర్వహణపై అవగాహన కల్పించడం, గ్రామీణ మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
సెంట్రలైజ్డ్ ఏసీతో ఆహ్లాదకర వాతావరణం
మేళాకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్న నేపథ్యంలో ఉక్క పోత ప్రభావం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మేళా ప్రాంగణంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యంతో ఉండటంతో సందర్శకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో షాపింగ్ చేస్తున్నారు. స్టాళ్లను సందర్శిస్తూ వివిధ ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవడంతో పాటు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయాలు నిర్వహించేందుకు మహిళా సంఘాలకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతోపాటు సందర్శకుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మేళా నిర్వహణలో భాగంగా సందర్శకులకు, స్టాల్ నిర్వాహకులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు సారస్ ఒక వేదిక
సారస్ మేళా కేవలం ఉత్పత్తుల విక్రయ కేంద్రంగానే కాక గ్రామీణ మహిళల ప్రతిభను, సృజనాత్మకతను వెలుగులోకి తీసుకొచ్చే వేదికగా నిలుస్తోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు తమ ఉత్పత్తులను వ్యాపారంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటువంటి మేళాలు దోహదపడుతున్నాయి. సంప్రదాయ కళలు, గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం లభించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఇవి తోడ్పడుతున్నాయి. మహిళలు ఉత్పత్తిదారులుగా మాత్రమే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే ఉత్పత్తి నాణ్యతతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, వినియోగదారులతో సంబంధాలపై అవగాహన అవసరం. సరస్ వంటి వేదికలు ఈ అవకాశాలను కల్పిస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్నాయి. నాలుగో రోజు కూడా సందర్శకుల రద్దీ, పెరుగుతున్న విక్రయాలు సరస్ మేళాకు లభిస్తున్న ఆదరణను ప్రతిబింబిస్తున్నాయి. మహిళా సంఘాల ఉత్పత్తులకు మరింత విస్తృతమైన మార్కెట్‌ను అందించడమే లక్ష్యంగా మేళా కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





