ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి హవా

– అధికార టీడబ్ల్యూయూకు కార్మికుల షాక్!
– ఎంప్లాయిస్ యూనియన్ కూటమి ఘనవిజయం
– కాంగ్రెస్, టీఆర్ఎస్ అనుబంధ టీఎంయూలకు నిరాశ
– 17న వెలువడనున్న రీజియన్ల వారీ అధికారిక ఫలితాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 10: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక వివరాలు, అందిన సమాచారం ప్రకారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) కూటమి రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సంస్థపై పట్టు నిలుపుకుంది. కాగా, ప్రభుత్వం బాహాటంగా అండదండలు అందించిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు కార్మికులు గట్టి షాక్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే రీజియన్లు, నాన్ ఆపరేటింగ్ యూనిట్లలో స్థానిక గుర్తింపు ఎవరికి దక్కిందనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) మూడు రీజియన్లు, టీడబ్ల్యూయూ ఐదారు రీజియన్లలో స్థానిక గుర్తింపు దిశగా ఆధిక్యంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రీజియన్ల వారీగా తుది అధికారిక ఫలితాలను ఈ నెల 17న ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ.. అశ్వత్థామరెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడబ్ల్యూయూకు బాహాటంగానే మద్దతు పలికింది. పార్టీ తరఫున ఎన్నికల ఇన్‌చార్జిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అయినప్పటికీ వెలువడుతున్న ఫలితాలు అధికార పార్టీకి శరాఘాతంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం అండగా నిలిచినా కార్మికులు మాత్రం సంప్రదాయ జేఏసీ పక్షానే మొగ్గు చూపినట్లు తేటతెల్లమవుతోంది. ఎన్నికల్లో ప్రతిపక్షబీఆర్ఎస్ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. బీఆర్ఎస్ మద్దతు ఉన్న టీఎంయూ కేవలం ఏడు డిపోలకే పరిమితమై మూడో స్థానానికి పడిపోయింది. ఉద్యమ సమయంలో కార్మికులందరినీ బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘంలో చేర్చినా కాలక్రమేణా కార్మికులు మళ్లీ తమ పాత సంఘాల వైపే వెళ్లడం గమనార్హం. వెలుపల సీపీఐ, కాంగ్రెస్ కూటమిగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం రెండు పార్టీల అనుబంధ సంఘాలు విడివిడిగానే పోటీ చేశాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *