– తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: పాతబస్తీలోని ఫలక్ నుమా కాళీ మాత ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవటం విచారకరమన్నారు. కాళీ మాత మందిరాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెమీడియాతో మాట్లాడారు. పాత బస్తీలోని కాళి మాత ఆలయమంటే హైదరాబాద్ ప్రజలకు ఎంతో నమ్మకమని, భక్తులకు కొంగు బంగారమని చెప్పారు. అలాంటి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేవని, సరైన రోడ్డు మార్గం లేదని, మహిళలకు వాష్ రూమ్ లు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. చుట్టూ రైల్వే స్థలాలు, పక్కనే శ్మశానం ఉండటంతో రోడ్డు వేసే పరిస్థితి కూడా లేదన్నారు. ఎండోమెంట్ డిపార్ట్ మెంట్, అదేవిధంగా రైల్వే అధికారులతో మాట్లాడి ఇక్కడ రోడ్లు వేసేలా, ఆలయంలో వసతులు కల్పించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
బతుకమ్మ పండుగ ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర ప్రజందరికీ కవిత బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్ ‘లో ట్వీట్ చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. నాడు రాష్ట్ర సాధనకు బతుకమ్మను సాంస్కృతిక వారధిగా మలుచుకున్న మనమంతా ఇప్పుడు సకల జనుల వికాసం, బహుజన తెలంగాణ సాధన కోసం బతుకమ్మలో గౌరమ్మలా ఒదిగి కలిసి పనిచేద్దామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





