సీఎం రేవంత్ కు విజన్ లేదు

– ప్లాట్లు కొనాలంటే ఎన్నారైలే భయపడుతున్నారు
– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రగతి పథం
– అమెరికాలో మాజీ మంత్రి హరీష్ రావు ‘మీట్ అండ్ గ్రీట్’

న్యూజెర్సీ, మే 21 : అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు న్యూజెర్సీలోని హల్దీ- మౌంట్ లారెల్‌లో ప్రవాస భారతీయులు, బీఆర్ఎస్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌తో పాటు ఎన్నారై ప్రతినిధులు మహేష్ తన్నీరు, నరసింహా రావు, భాస్కర్ పిన్న, రవీందర్ రావు తదితరులు హరీష్ రావుకు శాలువాలు, పూలమాలలతో సాదర స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ఎన్నారైలతో హరీష్ రావు విస్తృతంగా చర్చించారు. సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. “నాడు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్లే, ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణ.. పదేళ్లలో దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్ రాష్ట్రాన్ని సైతం మించిపోయి రికార్డులు సృష్టించింది. సంక్షేమం, ఐటీ, మౌలిక వసతులు.. ఇలా ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా మారింద‌న్నారు.

విజన్ లేని రేవంత్ పాలనతో ప్రజల ఇబ్బందులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి విజన్ లేదని, ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తెలంగాణలో స్థిరాస్తి పెట్టుబడులకు ఎగబడిన ఎన్నారైలు.. నేడు ఇక్కడి పరిస్థితులు చూసి స్వరాష్ట్రంలో కనీసం ఒక్క ప్లాట్ కొనాలన్నా తీవ్రంగా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్రంలో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే

దేశ రాజకీయాలపై స్పందిస్తూ దేశంలో ప్రాంతీయ పార్టీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల వల్లే ఆయా రాష్ట్రాలకు ఎక్కువ న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని, రాబోయే రోజుల్లో వాటి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ గ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎన్నారై ప్రముఖులు అమర్ గుండ, పరమేశ్ బీం రెడ్డి, చైతన్న చిట్టిమల్ల, వరప్రసాద్, చందు తాళ్ల, పూర్ణ బైరి, నర్సింహా రెడ్డి, దొంతిరెడ్డి, రజినీతో పాటు పలువురు ఉత్తర అమెరికా బీఆర్ఎస్ ప్రతినిధులు, తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *