– నియంత వారసత్వాన్ని పాటిస్తున్న సీఎం
– సీఎంవి ఫాసిస్టు విధానాలు
– కాంగ్రెస్‌వి ద్వంద్వ విధానాలు
– ఏఐసీసీని ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలి
– రాహుల్ ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏఐసీసీ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి అధికారికంగా తన పేరును ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోవాలన్నారు. ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ నేరుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇచ్చే జాతీయ నినాదం “మొహబ్బత్ కీ దుకాన్” కాస్తా, ఆయన స్వయంగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి క్రూర నియంత వారసత్వాన్ని అక్కున చేర్చుకోవడంతో తెలంగాణలో “హిట్లర్ కా మకాన్” (హిట్లర్ ఇల్లు) గా మారిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నైతికతలోని ద్వంద్వ ప్రమాణాలను ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ పాలనా విధానాలకు, స్థానిక కూల్చివేతలకు జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్, ఆయన “హంతక ముఠా” స్ఫూర్తి అని బహిరంగంగా పేర్కొనడంతో ఈ రాజకీయ వివాదం చెలరేగింది. అంతేకాకుండా, ఈ స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల విధ్వంసంతో ఎంతో గర్వంగా పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాలపై స్పందించిన కేటీఆర్.. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వారి ఫాసిస్టు పాలనా ఆలోచనా విధానానికి నిదర్శనమని, ఇది దేశ పునాది విలువలపై జరిగిన క్షమించరాని దాడి అని మండిపడ్డారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వహిస్తున్న వ్యూహాత్మక మౌనాన్ని వీడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిని మందలించకపోతే, ఆ నియంతృత్వ పద్ధతులను అధిష్టానం సమర్థించినట్లే అవుతుందని హెచ్చరిం చారు. “డియర్ రాహుల్ గాంధీ జీ.. మీ ‘మొహబ్బత్ కీ దుకాన్’ అధికారికంగా ‘హిట్లర్ కా మకాన్’ అయిందా..? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా క్రూర హిట్లర్‌ను కీర్తిస్తూ, అతని ‘హంతక ముఠా’లను పాలనా స్ఫూర్తిగా పేర్కొంటుంటే.. మీరు మౌనంగా ఉంటూ, ఢిల్లీలో రాజ్యాంగానికి తానే స్వయంప్రకటిత రక్షకుడినని ఎలా చెప్పుకుంటారు?” అని కేటీఆర్ తన పోస్ట్‌లో నిలదీశారు. ఒక ప్రజాస్వామ్య నాయకుడు నిజమైన రాజనీతిజ్ఞుల నుండి స్ఫూర్తి పొందుతాడని, కేవలం అధికారం తలకెక్కిన, పారనాయిడ్ పాలకుడు మాత్రమే క్రూర నియంతల నుంచి పాఠాలు వెతుక్కుంటాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలను మరింత తీవ్రం చేస్తూ.. నియంతృత్వ పద్ధతులను పండగ చేసుకోవడం, స్థానిక నివాసాలను యుద్ధ ప్రాంతాలలా మార్చడమే ఆ పార్టీ అసలు సిసలైన పాలనా బ్లూ ప్రింట్ అయితే వారు సిద్ధాంతాల ముసుగును పూర్తిగా తొలగించుకోవాలని కేటీఆర్ సూచించారు. నియంతృత్వ పద్ధతులను సెలబ్రేట్ చేసుకోవడం, స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధ ప్రాంతాల విధ్వంసంతో గర్వంగా పోల్చడమే మీ పార్టీ అసలు పాలనా విధానం అయితే ఏఐసీసీ తన సిద్ధాంతాల ముసుగును తీసివేసి ఆల్ ఇండియా నాజీ పార్టీగా పేరు మార్చుకోవాలి. మీ మౌనం ఈ వ్యాఖ్యలను అంగీకరించినట్లే అవుతుంది. దేశం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది అని కేటీఆర్ ముగించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




