-పేపర్ తయారీ నుంచి, ప్రింటింగ్ వరకు సీక్రెట్
-పేపర్ తయారీదారులంతా రహస్య ప్రదేశానికి తరలింపు
న్యూదిల్లీ, జూన్ 8: ఈనెల 21న దేశవ్యాప్తంగా జరగనున్న ‘నీట్’ రీ టెస్ట్‌ను అత్యంత పారదర్శకంగా, లీకులకు ఏమాత్రం తావులేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేశాయి. ఈసారి క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వకుండా ఉండేందుకు ఏకంగా భారత వైమానిక దళం సహాయం తీసుకోనున్నారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఈ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. మే 3న జరిగిన ‘నీట్’ పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో క్వశ్చన్ పేపర్లను ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించే రవాణా సమయంలోనే లీకేజీ ముఠాలు చేతివాటం ప్రదర్శించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి.. ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో సరికొత్త చర్యలు చేపడుతున్నారు. దీని ప్రకారం క్వశ్చన్ పేపర్లను అత్యంత సురక్షితమైన ఎయిర్‌ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. దీనివల్ల రవాణాలో జరిగే ఆలస్యం తగ్గడమే కాకుండా.. అనధికారిక వ్యక్తులు క్వశ్చన్ పేపర్లను తాకే అవకాశం కూడా ఉండదు. ఈసారి భద్రతను ఏ స్థాయిలో పటిష్టం చేశారంటే.. క్వశ్చన్ పేపర్లను తయారు చేసే నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులను పరీక్ష జరిగే జూన్ 21వ తేదీ వరకూ ఒక రహస్య ప్రాంతంలో పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. క్వశ్చన్ పేపర్ల బాక్సులకు హైటెక్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ గుర్తింపును పకడ్బందీగా పరిశీలిస్తారు. రీ-ఎగ్జామ్‌కు ముందు సోషల్ మీడియాలో నకిలీ పేపర్లు అమ్ముతూ విద్యార్థులను మోసం చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు.. మరోవైపు సైబర్ విభాగాన్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన తప్పుల కారణంగా పరీక్ష రద్దయినందున, ఈ రీ-టెస్ట్ కోసం హాజరయ్యే విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షకు సిద్ధం కావాలని ఎన్టీఏ కోరింది. మరో రెండు వారాల్లో నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జరగనుంది. పేపర్ లీక్ ఆరోపణలతో ఇప్పటికే ఓసారి పరీక్షను రద్దు చేయడంతో రీ-టెస్ట్ నిర్వహణ విషయంలో ఎన్‌టీఏ అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. పేపర్ తయారీ దశ నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న నిపుణులను రహస్య ప్రదేశంలో లాక్‌డౌన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ డియా కథనాలు వెల్లడించాయి. నీట్ యూజీ పేపర్ తయారుచేసిన నిపుణులు, పర్యవేక్షకులు, ట్రాన్స్‌లేటర్లు సహా ఈ పక్రియలో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ ప్రస్తుతం అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంతంలో ఉంచినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరిపై భద్రతా అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంచారని తెలిపాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలేవీ వీరికి అందుబాటులో ఉంచలేదట. కేవలం అనుమతి పొందిన సిబ్బందికి మాత్రమే ఈ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ పూర్తయ్యేంతవరకు వీరు ఈ లాక్‌డౌన్‌లోనే ఉండనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. పేపర్ తయారీ నుంచి ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజీ, రవాణా, పంపిణీ వరకు అన్ని దశల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలుచేస్తున్నారు. పేపర్ రవాణా కోసం వాయుసేన విమానాలను వినియోగించనున్నారు. ఇదిలాఉండగా.. రీ-ఎగ్జామ్ పేపర్ సైతం లీక్ అయిందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీన్ని ఎన్‌టీఏ తీవ్రంగా ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్పచ్రారం అవాస్తవం, మోసపూరితమని పేర్కొంది. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 వరకు నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ జరగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్