ఎస్ఐఆర్ అధికారులకు రక్షణ కల్పించాలి

– పోలీసు అధికారులకు సీఈవో ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు తగిన భద్రత, సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) పి.సుదర్శన్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌ను నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తన కార్యాలయంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్‌లతో కలిసి ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల 25 నుండి ప్రారంభం అవుతుందని, కావున బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, తిరిగి వాటిని సేకరించాలని సూచించారు. అలాగే ఈ ప్రక్రియలో పాల్గొనే  బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్ల పేర్లను, ఫోన్ నెంబర్లను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. అంతేకాక సమన్వయం చేసుకోవడానికి పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లను కూడా ఎన్నికల అధికారులు సేకరించుకోవాలని సూచించారు. ఈ సర్వే ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారు(డీఈవో)లను ఆదేశించారు. తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ ఎసఐఆర్ విధుల్లో పాల్గొనే బీఎల్‌వోలు, ఇతర అధికారులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అండ్ డీఈఓలు, ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్లు, డిప్యూటీ సీఈవో(ఎఫ్‌ఏసీ), నోడల్ అధికారులు, పీఎం-ఐటీ, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు

స‌ర్ ప్ర‌క్రియ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌పాలి : – టీవీఆర్ఎఫ్ విన‌తిప‌త్రం 

అర్హులైన ఏ ఒక్క ఓటరునూ జాబితా నుంచి తొలగించకుండా న్యాయసమ్మతమైన, పారదర్శకమైన ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్‌) ప్రక్రియ నిర్వహించాలని తెలంగాణ ఓటరు హక్కుల వేదిక (టీవీఆర్ ఎఫ్‌)కు చెందిన 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నిక‌ల అధికారికి సోమ‌వారం విన‌తిప‌త్రం స‌మ‌ర్పించింది.  ఇతర రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన స‌ర్‌ ప్రక్రియల అనుభవాలను ప్రస్తావిస్తూ, వివిధ కారణాల వల్ల అర్హులైన ఓటర్లు ఓటరు జాబితాల నుంచి తొలగించబడే అవకాశం ఉందన్న తీవ్రమైన ఆందోళనలను ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది. పూర్తి పారదర్శకత, విస్తృత ప్రజా అవగాహన, ధృవీకరణకు తగిన సమయం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలకు సులభమైన ప్రాప్యత, అలాగే దళితులు, ఆదివాసీలు, మతపరమైన మైనారిటీలు, వృద్ధులు, వలస కార్మికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, దివ్యాంగులు, విద్యార్థులు, ఇతర సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు కల్పించాలని వేదిక ఎన్నికల సంఘాన్ని కోరింది. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి మినహాయించబడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. ఈ ఆందోళనలను పరిశీలిస్తామని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పునర్విమర్శ ప్రక్రియను న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా స‌ర్‌ ప్రక్రియను తెలంగాణ ఓటరు హక్కుల వేదిక నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుంద‌ని ప్ర‌తినిధి బృందం పేర్కొంది. ఈ బృందంలో అకునూరి మురళి ,  పద్మజా షా, అలాగే సౌమ్య కిడాంబి, దీప్తి బత్తిని, మార్గరెట్, మీరా సంఘమిత్ర, అబ్దుల్ ఖాలిక్ , అఖిల్ సూర్య వంటి సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *