– విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరాయే లక్ష్యం
– సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత, నిరంతరాయమైన నాణ్యమైన బొగ్గు లభ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు తక్షణమే వెళ్లనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. మంగళవారం నాడు మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్ లో ఇంధనశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఎల్ నినో వాతావరణ పరిస్థితుల్లో జల విద్యుత్ ఉత్పాదనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో జెన్ కో పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్టస్థాయిలో ఉత్పాదకత పెంచేలా తప్పనిసరి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. జెన్ కోలో పెరిగిన స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, దీర్ఘకాలిక సమయంలో బొగ్గు సరఫరాలో ఏర్పడే సవాళ్లు, భవిష్యత్ కార్యచరణ ప్రణాళిపై సుదీర్ఘంగా ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తరువాతే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర పనుల్లో వేగవంతమైన పురోగతి వచ్చిందన్నారు. వైటీపీఎస్ ను 2016-17లో గత ప్రభుత్వం ప్రారంభించింనా పనులు నత్తనడకన సాగాయి. అంతేకాక వైటీపీఎస్ కు సీంగరేణి నుంచి ఏటా 14 వేల టన్నుల జీ9 గ్రేడ్ రకం బొగ్గును సరఫరా చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఉన్నా.. గత ప్రభుత్వం నిర్మాణ పనుల్లో జాప్యం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం ఎక్కడా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించకపోవడంతో నేడు అనేక సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. అంతేకాక సింగరేణితో 2022లో బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదిరినా… ఎంతమేర బొగ్గు పరిమాణం, బొగ్గు నాణ్యత, సరఫరా వంటి వాటిని ప్రణాళిక బద్ధంగా నిర్ణయించకపోవడం కూడా నేటి సమస్యలకు కారణంగా మారిందని ఆయన అన్నారు. వైటీపీఎస్ ను మేమే మొదలు పెట్టామని గొప్పలు చెప్పుకునే గత పాలకులు.. కనీసం పర్యావరణ అనుమతులు కూడా సాధించలేకపోయారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసుల కారణంగా వైటీపీఎస్ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకమైన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల తరువాత 2023లో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైటీపీఎస్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు సాధించి పనులను పరుగులు పెట్టించిందని అన్నారు. పనులు ప్రారంభించిన ఏడాదికే అంటే 2025లోనే మొదటి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించినట్లు ఆయన చెప్పారు. 2025–26, 2026–27 సంవత్సరాల మధ్య మరో మూడు యూనిట్లు (3× 800 మెగావాట్లు) ప్రారంభించామని అయన అన్నారు. ప్రజాప్రభుత్వం తీసుకున్నచర్యల మూలంగా 2026–27 నాటికి జెన్ కో మొత్తం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి 7,180 మెగావాట్లకు చేరిందన్నారు. బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2025-26లో విజయవంతంగా 27,908 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయన్నారు. రాష్ట్ర మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 31% అవసరాలను జెన్ కో సమర్థవంతంగా తీర్చిందన్నారు. ఇది గతంలో అంటే 2024-25లో కేవలం 25.14%గా ఉండేదన్నారు. బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఉన్నా విద్యుత్ ఉత్పాదనలో జెన్ కో అత్యంత క్రియాశీలకంగా ఉందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శమని ఆయన చెప్పారు. బొగ్గు సరఫరాను మెరుగుపరిచి.. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 40 శాతం మేర జెన కో తీర్చగలిగేస్థాయికి చేరుస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 2026లో వైటీపీఎస్ 5వ యూనిట్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత, నిరంతరాయమైన నాణ్యమైన బొగ్గు లభ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు తక్షణమే వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా మరియు నాణ్యతపై ఎదురవుతున్న సమస్యలపై క్షేత్రస్థాయిలోనే ప్రత్యక్ష సమీక్షలు నిర్వహించనున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సకాలంలో అందేలా చూడటం, ఉత్పత్తిలో వేగం పెంచడం మరియు సరఫరా వ్యవస్థలో ఆటంకాలను తొలగించడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పాల్గొంటారని అన్నారు. సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జెన్ కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





