-నాడు కేసీఆర్ దృఢనిశ్చయంతో వ్యవహరించారు
– అన్ని వివరాలు సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా వున్నాయి
– సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ఈకేసు వాదించారు
– ఈ భూములను తెగనమ్మే కుట్రకు తెర లేపారు
– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్30: బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడి కాపాడిన విలువైన ప్రభుత్వ భూమిని.. ఈ రోజు తాము అమ్ముకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. మియాపూర్ 550 ఎకరాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని సుప్రీంకోర్టు రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. మియాపూర్ భూ వివాదం 2003లోనే ఎస్ఎల్పీ గా సుప్రీంకోర్టుకు చేరింది. 2013లో అది సివిల్ అప్పీల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ విలువైన భూమి ప్రభుత్వం చేజారిపోకూడదని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ నిశ్చయంతో వ్యవహరించారు. 2015లోనే దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్‌ను ప్రత్యేకంగా నియమించారు. ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయి. ప్రజలందరికీ అందుబాటులోనూ ఉన్నాయి. సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్ 2015 ఏప్రిల్ 7 నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున మియాపూర్ భూముల రక్షణ కోసం సుప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారు. 2015 నుంచి 2023 వరకు దాదాపు 8 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల పరిరక్షణ కోసం అలుపెరగని న్యాయపోరాటం చేసింది. మియాపూర్ భూమికి సంబంధించిన ప్రతి పిటిషన్, ప్రతి అఫిడవిట్, సమగ్ర ఆధారాలను సుప్రీంకోర్టు ముందు ఉంచింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. గౌరవ సుప్రీంకోర్టు మియాపూర్ భూముల తీర్పులో మియాపూర్ తీర్పుకు అసలు పునాది ‘ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్’ కేసు తీర్పేనని స్పష్టంచేసింది. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన ఆ కేసు 2023 జూన్ 15న తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించింది అదే వైద్యనాథన్. నాడు మేము సాధించిన ఆ విజయమే, ఆ తీర్పులోని చట్టపరమైన అంశాలే నేడు మియాపూర్ భూముల తుది తీర్పుకు బలమైన ఆధారమయ్యాయి. ఈ రికార్డులన్నీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో బహిరంగంగా ఉన్నప్పటికీ, తానే ఏదో సాధించినట్లు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటు.
ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర పోరాటం వల్లే నేడు మియాపూర్ భూములు పరిరక్షించబడ్డాయని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశం వెనుక ఉన్న అసలు కుట్ర వేరే ఉంది. మియాపూర్‌లో ఉన్న ఈ 550 ఎకరాల భూమి విలువ రూ. 60 వేల కోట్ల పైమాటేనని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఈ విలువైన భూములను అమ్ముకోవడానికే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.విలువైన జాతి సంపదను ప్రజల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించకుండా తెగనమ్ముకునే కుట్రకు తెర లేపారని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




