రాష్ట్రంలో ఇక విజ్ఞాన విప్లవం

– రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
– రూ.25 కోట్లతో ఎస్సీ హాస్టల్
– ఉద్యోగాల నోటిఫికేషన్లతోపాటు ఉచిత డిజిటల్ కోచింగ్
– ప్రజా ప్రభుత్వ వినూత్న సంకల్పం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ప్రజా ప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లోయర్ ట్యాంక్ బండ వద్ద రూ.110 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్‌కు సబంధించి స్థల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఈ రెండింటికీ ఆర్థిక, పాలనపారమైన అనుమతులు మంజూరయ్యాయని, ఈ భవనాలు వేలాదిమంది విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోచింగ్ కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ బలమైన సంకల్పమని స్పష్టం చేశారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ స్థలాన్ని, నింబోలిఅడ్డా హాస్టల్ ప్రాంగణాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్మాణ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మరో పది అంతస్తులతో నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. నింబోలిఅడ్డా వద్ద మూడు అంతస్తులతో హాస్టల్ భవనాల నిర్మాణం దళిత, నిరుపేద వర్గాల చిరకాల వాంఛ అని చెప్పారు. నాలెడ్జ్ సెంటర్‌లో స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్ విజ్ఞానాన్ని పంచే అత్యుత్తమ వేదికలుగా నిలుస్తాయనే అశాభవాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్వహించే కార్యకలాపాలను డిజిటల్ వ్యవస్థతో మారుమూల ప్రాంతాలకు చేర్చేలా అధునాతన సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్సును నిర్మిస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. పేద, బలహీన వర్గాల, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు కోచింగ్ కోసం హైదరాబాద్ రాకుండా ఉన్నచోటనే సిద్ధమయ్యేలా ఇవి ఉండబోతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయా నియోజకవర్గాల్లోనే వాళ్లకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ది బెస్ట్ లెక్చరర్స్ ఇక్కడినుంచి పాఠాలు చెబుతుంటే ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఉన్నచోటనుంచే కోచింగ్‌ను పొందేలా ఈ సెంటర్లను ఇంటర్‌లింక్ చేస్తున్నట్లు చెప్పారు. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు, వ్యవసాయం చేసుకునే కుటుంబాలు, మధ్యతరగతి చిన్న వ్యాపారుల పిల్లలు పోటీ పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ వసతి ఖర్చుల భారాన్ని మోయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేవలం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడమేకాక నిరుద్యోగులు ఆయా ఉద్యోగాలను సాధించేలా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని ఈ నాలెడ్జ్ సెంటర్ ద్వారా అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.

రూ.50 కోట్లు కేటాయింపు

ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించే ఈ భవన సముదాయంలో స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయన్నారు. మేధావులతో ఇక్కడ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 2016లోనే దీనికి శంకుస్థాపన చేసినా నిర్మించలేకపోయిం దన్నారు. తమ ప్రజాప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయడానికి సంకల్పించిందని మంత్రి స్పష్టం చేశారు. పనులు వేగంగా జరగడానికి బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ ఆర్కిటెక్చర్, బెస్ట్ డిజైన్స్‌తో ఈ భవనాన్ని నిర్మించాల్సిందిగా సంక్షేమ శాఖకు ఆయన సూచించారు.

నింబోలిఅడ్డా హాస్టల్ ఆధునికీకరణ

ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆశ్రయమిచ్చి ఉన్నత ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన కాచిగూడలోని నింబోలిఅడ్డా హాస్టల్‌ను పూర్తిగా ఆధునికీకరణ చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ప్రతిపా దనను చేశామని చెప్పారు. ఈ హాస్టల్‌కు బాబు జగ్జీవన్ రామ్ నాలెడ్జ్ సెంటర్‌గా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడా విజ్ఞానాన్ని వ్యాప్తి చేసేలా మరొక అద్భుతమైన నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *