వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అవసరం

“ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల అంచనాను 50 ఏళ్ల సగటుతో పోలిస్తే 90 శాతానికి తగ్గే అవకాశముందన్న అంచనాల నడుమ ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయనీ .. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఖరీఫ్ పంటల విత్తనాల సాగుకు అత్యంత కీలకమైన ఈ రుతుపవనాలు జూన్ 4న కేరళను మూడు రోజుల ఆలస్యంగా వొచ్చినట్లు ఐఎండీ తెలిపింది.”

భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. భూమి యాజమాన్యం ప్రధానంగా రైతుల చేతుల్లో ఉన్నప్పటికీ, వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ప్రభావం మాత్రం అత్యంత ఎక్కువగా ఉంది. విత్తనాల నుంచి ఎరువుల వరకు, కనీస మద్దతు ధరల నుంచి ధాన్య సేకరణ వరకు, మార్కెట్ వ్యవస్థ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వరకు ప్రతి దశలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ విధానాలు రైతులకు భరోసా కల్పించినప్పటికీ, కాలానుగుణంగా కొన్ని ప్రతికూల పరిణామాలకు కూడా దారితీస్తున్నాయి.

దేశంలో గోధుమలు, బియ్యం వంటి ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగి ప్రభుత్వ గోదాములు నిండిపోతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేస్తోంది. ఇది ఆహార భద్రత పరంగా ఒక విజయంగా కనిపించినప్పటికీ, ప్రజల ఆహారపు అలవాట్లలో వొస్తున్న మార్పులకు వ్యవసాయ ఉత్పత్తి సరైన రీతిలో స్పందించడం లేదు. దేశ ఆర్థికాభివృద్ధితో ప్రజల జీవనశైలి మారుతోంది. పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్‌ అధికంగా ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం ఇప్పటికీ ప్రధానంగా వరి, గోధుమలపైనే కేంద్రీకృతమై ఉంది.

ఈ పరిస్థితి కేవలం మార్కెట్ అసమతుల్యతకే కాకుండా ప్రజారోగ్య సమస్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. అధిక కార్బోహైడ్రేట్‌ ఆధారిత ఆహారం స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల పెరుగుదలకు ఒక కారణంగా మారుతోంది. సమతుల్య పోషకాహారం అందుబాటులో ఉండేలా వ్యవసాయ విధానాలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది.

మరోవైపు వ్యవసాయ ఇన్‌పుట్ సబ్సిడీలు కూడా అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. ఎరువులపై భారీ సబ్సిడీలు రైతులకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించినప్పటికీ, అవి ఎరువుల అసమతుల్య వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా యూరియా అధిక వినియోగం వల్ల నేల సారవంతత దెబ్బతింటోంది. భూసార నష్టం, సూక్ష్మ పోషకాల లోపం, భూగర్భ జలాల కాలుష్యం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది వ్యవసాయ ఉత్పాదకతకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

విద్యుత్‌, నీరు, ఎరువులపై అధిక సబ్సిడీలు వ్యవసాయ ఖర్చుల వాస్తవాలను   దాచిపెడుతున్నాయి. ఫలితంగా రైతులు, వినియోగదారులు ఇద్దరూ మార్కెట్ వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ధరలు ఉత్పత్తి ఖర్చులను ప్రతిబింబించకపోతే సరఫరా-డిమాండ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావం చివరికి రైతు ఆదాయం పైనా, వినియోగదారుల సంక్షేమం పైనా పడుతుంది.

అయితే సబ్సిడీలను పూర్తిగా తొలగించాలనేది సరైన పరిష్కారం కాదు. పేదలు, చిన్న రైతులు రక్షణ పొందడం తప్పనిసరి. కానీ ఆ సహాయాన్ని వస్తువుల రూపంలో కాకుండా నేరుగా నగదు బదిలీ రూపంలో అందించడం మరింత సమర్థవంతమైన మార్గం కావొచ్చు. ఆధార్‌, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యిత సహాయం అందించడం వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయి. అదే సమయంలో మార్కెట్ ధరలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే అవకాశముంటుంది.

వ్యవసాయ సంస్కరణల ప్రస్తావన వొచ్చినప్పుడల్లా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవడం సహజం. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు  రైతు ఉద్యమాలకు దారితీశాయి. చివరకు ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వొచ్చింది. ఈ అనుభవం ప్రభుత్వాలకు ఒక పాఠంగా నిలిచింది. రైతుల విశ్వాసం లేకుండా ఎటువంటి సంస్కరణలూ విజయవంతం కావు.

అందువల్ల భవిష్యత్తు వ్యవసాయ సంస్కరణలు కేవలం మార్కెట్ స్వేచ్ఛకు పరిమితం కాకుండా, రైతు ఆదాయం, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగ సామర్థ్యం, భూసార సంరక్షణ వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు, వినియోగదారుల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపి ఒక జాతీయ వ్యవసాయ సంస్కరణల కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.

భారత వ్యవసాయం ఈరోజు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఆహార భద్రతను సాధించిన దేశం ఇప్పుడు పోషక భద్రత, పర్యావరణ స్థిరత్వం, రైతు ఆదాయ భద్రత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. ఇందుకోసం ధైర్యవంతమైన,రైతు ప్రయోజనాలను కాపాడే సంస్కరణలు అత్యవసరం. వ్యవసాయ రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చగలిగితేనే భారతదేశ అభివృద్ధి మరింత సమగ్రంగా, స్థిరంగా కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *