– తమిళనాడు ప్రచారంలో ఖర్గే వివాదాస్పద వ్యాఖ్య
– మండిపడ్డ బీజేపీ నేతలు
– అలా అనలేదని వివరణ ఇచ్చిన ఖర్గే
చెన్నై, ఏప్రిల్ 21 : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ ప్రధాని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆయన క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తును ప్రశ్నించిన ఖర్గే ఆ పార్టీ మోదీతో ఎలా చేతులు కలిపిందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రిని టెర్రరిస్టుగా అభివర్ణించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు. అలాంటి వాళ్లతో అన్నాడీఎంకే కలవడమంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రచార సభలో చేసిన టెర్రరిస్టు వ్యాఖ్యలపై ఖర్గే వివరణ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని, సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, ఆ సందర్భంలోనే తాను మాట్లాడానని, మోదీని టెర్రరిస్టు అని తాను అనలేదని చెప్పారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రచారంపై మీడియా అడిగినప్పుడు చాలా బాగా జరిగిందని, అన్నిచోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తమ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఖర్గే సమాధానమిచ్చారు. రాహల్ గాంధీ, స్టాలిన్ ఒకే వేదిక నుంచి ప్రచారం సాగించకపోవడంపై అడగగా ఆ విధంగా చూడకూడదని, ప్రతి ఒక్కరూ ప్లానింగ్ ప్రకారమే ప్రచారం చేస్తుంటారని చెప్పారు. ’నేను ఒకచోట నుంచి ప్రచారం చేస్తే రాహుల్ మరోచోట ఉంటారు.. ఎవరు ఎక్కడ ప్రచారం చేసినా సమష్టి ఆలోచనతోనే ప్రచారం సాగుతుంది. అంతా కలిసికట్టుగా పోరాటం సాగించాం. మేము గెలుస్తాం’ అని ఖర్గే సమాధానమిచ్చారు. కాగా, ప్రధాని మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మైండ్‌సెట్‌కు ఆయన చేసిన వ్యాఖ్యలు అద్దంపడతాయన్నారు. ఆయన నోరుజారి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఉద్దేశపూర్వకంగా చేసినవేనని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిరోజూ తన ప్రసంగాల్లో ప్రధానిని నిందిస్తుంటారని, ఈరోజు రాహుల్ తరఫున మల్లికార్జున్ ఖర్గే ఆపని చేశారని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒసామా బిన్ లాడెన్‌ను ఒసామాజీ అని, జకీర్ నాయక్‌ను శాంతిదూత అని సంబోధిస్తుంటుందని ఎద్దేవా చేశారు. ప్రధానిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిందించినా ప్రజలు శిక్షిస్తూనే వచ్చారని, ఈసారి కూడా ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని అన్నారు.
ఖర్గేవి దిగజారుడు వ్యాఖ్యలు : మండిపడ్డ కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉగ్రవాది అని సంబోధించడాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఖర్గేకు పేరు ఉందని ప్రస్తావించారు. బాధ్యాతాయుతమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఖర్గే.. మోదీపై పదే Ÿదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆ పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని బట్టబయలు చేస్తోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అహోరాత్రులు శ్రమిస్తున్న మోదీని ఉగ్రవాదిగా సంబోధించే ముందు ఉగ్రవాదులతో కాంగ్రెస్ నాయకులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయాన్ని ఖర్గే గుర్తుపెట్టుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కశ్మీర్ వేర్పాటువాద ఉగ్రవాది యాసిన్ మాలిక్‌తో చర్చలు జరిపిన విషయం ఖర్గేకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని, కానీ ఈ ప్రయత్నంలో వ్యక్తిగత దూషణలకు చోటులేదని చెప్పుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలోనూ కావాల్సినంత విషం కక్కారని ఆగ్రహించారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు తమను ద్వేషిస్తున్నారని తెలిసి ఆవేదనతో, ఆక్రోశంతో ప్రధానమంత్రిపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




