– ఉద్రిక్తతలు తగ్గడంతో మార్కెట్లో సానుకూల పరిస్థితి
– 72.28 డాలర్లకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర
– బంగారం ధరలు కూడా భారీగా తగ్గుతున్నట్లు అంచనా
న్యూదిల్లీ, జూన్ 25 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో చమురు రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వేగవంతం అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని రోజులుగా చమురు ధరలు భారీగా దిగొస్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా`ఇరాన్ యుద్ధం ముందు స్థితికి పడిపోవడం ఊరటనిస్తోంది. గురువారం ఉదయం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.28 డాలర్లకు పడిపోయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే దీని ధర 4శాతం మేర తగ్గడం గమనార్హం. ఇక, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడాయిల్ ధర 1.69శాతం తగ్గి బ్యారెల్‌కు 69.15 డాలర్లు పలికింది. ఇటీవలి కాలంలో దీని ధర 70 డాలర్ల దిగువకు చేరడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో హర్మూజ్ జలసంధి విÖదుగా కనీసం రెండు కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయినట్లు అమెరికా ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ జలమార్గంలో చమురు రవాణా యుద్ధం మునుపటి స్థాయికి పెరుగుతుందని అంచనా. పశ్చిమాసియాలో యుద్ధం ముగియడంతోపాటు ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించడం వంటి కారణాలతో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నాయి. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3996 డాలర్లకు చేరింది. వెండి ధర 57.35 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో హైదరాబాద్ విపణిలో గురువారం ఉదయం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1.44లక్షలు పలికింది. కిలో వెండి ధర రూ.2.22లక్షలకు దిగొచ్చింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.41లక్షలు (10 గ్రాములకు), వెండి ఫ్యూచర్ ధర రూ.2.13లక్షలుగా (కిలోకు) ట్రేడ్ అవుతోంది. మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా గురువారం లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు.. దేశీయంగా బ్యాంకింగ్, స్థిరాస్తి రంగ సూచీల్లో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. దీంతో ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 511.62 పాయింట్లు పెరిగి 77,502 వద్ద, నిప్టీ 150 పాయింట్ల లాభంతో 24,172 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పెరిగి 94.33 వద్ద కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





