ముగ్గురు మంత్రులతో ఖమ్మంకు ఒరిగింది శూన్యం

– మట్టి దోపిడీ వెనుక మంత్రి తుమ్మల
– విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలి
– సత్తుపల్లి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : ‘రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈ దుర్మార్గ పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని ప్రజలు కోరుతున్నారు.. కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే కేసీఆర్ చెప్పారు.. రెండున్నరేళ్ల ఈ అసమర్థ పాలనలో జరిగిన న‌ష్టం ఏంటో ఆలోచించండి.. కాంగ్రెస్ హయాంలో మోసపోని వర్గం లేదు.. కుప్పకూలని రంగం లేద’ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యకర్తలకు బుధవారం నిర్వహించిన ‘ఎస్ఐఆర్’ అవగాహన కార్యక్రమం, పార్టీ సభ్యత్వ నమోదు సభలో ఆయ‌న‌ మాట్లాడారు. తొలిసారి రైతుకు పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచన చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, 72 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.73 వేల కోట్లు వేసిన ఘనత ఏకైక ముఖ్యమంత్రిగా ఆయనకు దక్కిందన్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్‌ 72 సార్లు ఢిల్లీకి పోయి పైసా తెచ్చింది లేదని ఆరోపించారు. పవర్ ఫుల్ శాఖలన్నీ ఖమ్మంలోని ముగ్గురు మంత్రుల చేతిలోనే ఉన్నాయని, ఈ ముగ్గురితో జిల్లాకు ఒరిగింది శూన్యమని అన్నారు. షాపుల్లో లేని యూరియా యాప్ లో ఎక్కడ ఉంటద‌ని ప్ర‌శ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ స్థానాలు కట్టబెడితే యూరియా యాప్ ను బంగాళాఖాతంలో పడేస్తాం.. మళ్లీ ఆటో అన్నకు ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా ఇచ్చి పోయే రోజులు తెస్తాం అని చెప్పారు. నియోజకవర్గాల్లో పనిచేసే విలేకరులకు బీఆర్ఎస్ హయాంలో అక్రిడేషన్ కార్డులు ఇచ్చే వాళ్లం.. కాంగ్రెస్ హయాంలో వాటి విషయంలోనూ అన్యాయం చేస్తున్నారన్నారు. ఐ అండ్ పీ ఆర్ మంత్రి పొంగులేటి విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలని కోరుతున్నా అన్నారు. లేకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. గ్యారంటీ కార్డుల అంశం ప్రస్తావిస్తూ కమల్ హాసన్ ను మించిన భట్టి యాక్టింగ్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మరో ఇద్దరు మంత్రులైన తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలపైనా కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. సత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్ లో మార్కెట్ విలువకు విరుద్ధంగా భూములు విక్రయించారని ఆరోపించారు. రూ.40 లక్షల ప్రభుత్వ ధర ఉంటే రూ.21 లక్షలకు ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు. కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మట్టిని దోపిడీ చేస్తున్నారని, దీనికి వెనుక తుమ్మల ఉన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *