ఆలోచన.. ఆచరణ కేసీఆర్‌ది

– ప్రచారం, ఫలితం కాంగ్రెస్‌ది
– సనత్‌నగర్ టిమ్స్‌ అంశంపై హరీష్ రావు విమర్శలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే కేసీఆర్ రూపకల్పన చేసిన టిమ్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. సనత్‌నగర్‌లోని టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంపై ఆయన ఓ ప్రకటనలో స్పందించారు. డేట్లు, డెడ్‌లైన్లు మార్చుకుంటూ పోయి చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం శోచనీయమన్నారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన హాస్పిటల్‌ను కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌కు మూడు వైపులా మÖడు టిమ్స్(అల్వాల్, సనత్‌నగర్, ఎల్బీనగర్) ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కార్పొరేట్‌స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ ఆలోచన అని, కరోనా తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వందేళ్ల ముందు చూపుతో టిమ్స్‌కు రూపకల్పన చేశారని అన్నారు. కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు మూడు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించారన్నారు. ప్రణాళిక కేసీఆర్‌ది.. శంకుస్థాపన కేసీఆర్‌ది.. నిధులు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఒక్కో హాస్పిటల్ వెయ్యి పడకల సామర్థ్యంతో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో నిర్మించే మÖడింటి నిర్మాణానికి రూ.2,679 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా సాగిన పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడకన సాగాయన్నారు. మÖడున్నరేళ్ల సుదీర్ఘ కాలంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండా కేవలం ప్రచారం కోసం నేడు టిమ్స్ సనత్‌నగర్‌ను ప్రారంభిస్తున్నారన్నారు. కనీసం హాస్పిటల్‌కు నీటి సరఫరా కూడా కల్పించలేదంటే పేదల వైద్యం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థం అవుతోందని విమర్శించారు. కేసీఆర్ పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని బీఆరఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *