– 7న రానున్న కేంద్ర సాంకేతిక బృందం
న్యూదిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈనెల 7న పర్యటించనుంది. దిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో మంగళవారం భేటీ అయిన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేకపోవడంతో కొత్తగా మరికొన్ని స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణ సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. సాంకేతిక నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. భద్రాచలం రామాలయ విశిష్టతను, జిల్లా ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను పరిగణనలోకి తీసుకుని వెంటనే స్పందించిన కేంద్ర మంత్రికి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. అలాగే, వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





