– మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత రెండున్నరేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ప్రస్తుతం 650కి పడిపోయిందని, ఇప్పటికే సుమారు 310 కళాశాలలు మూతపడ్డాయని తెలిపారు. అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందికి 5 నుంచి 10 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తమను కలసి వినతిపత్రం అందజేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆయన హెచ్చరించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, కరోనా కష్టకాలంలోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆపలేదని, తొమ్మిదిన్నరేళ్లలో రూ.19,500 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు.
అసెంబ్లీని స్తంభింపజేస్తాం
ఎలక్షన్ మేనిఫెస్టోలో పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పి మూడు బడ్జెట్లు మారినా ఇప్పటికీ దాదాపు రూ.10,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ప్రతీ విద్యాసంవత్సరం నిర్ణీత గడువులోగా నిధులు విడుదల చేసేలా శాశ్వత విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





