వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ప్రజా వంచనే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్ర ధ్వజం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకున్న వెయ్యి రోజుల పాలన ప్రజా పాలన కాదని, అది ముమ్మాటికీ ప్రజా వంచన పాలన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడుల నేప‌థ్యంలో ఆయ‌న‌ను పరామర్శించేందుకు వెళ్తుంటే మంగ‌ళ‌వారం హౌజ్ అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను విస్మరించి రాష్ట్ర ప్రజలను దయనీయ స్థితిలోకి నెట్టారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఈ రోజుల వెయ్యి పాలన ప్రజలకు ఏమి ఇచ్చిందో పరిశీలిస్తే నేడు తెలంగాణ అత్యంత ఆందోళనకరమైన, దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది అన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు, గ్యారెంటీలలో ఇప్పటివరకు అమలైనవి ఎన్ని.. నెరవేర్చిన హామీలు ఏవి అని ప్రభుత్వాన్ని నిల‌దీశారు.

రైతులు, నిరుద్యోగులకు ద్రోహం

రుణమాఫీకి ₹40,000 కోట్లు అవసరమైతే కేవలం ₹18,000 కోట్లతో చేతులు దులుపుకున్నారని, రైతు భరోసాను ₹15,000 నుంచి ₹12,000 కు తగ్గించి బకాయిలు పెట్టారని మండిపడ్డారు. కౌలు రైతుల సమస్యలు పట్టించుకోలేదని, ₹500 ధాన్యం బోనస్ హామీ అమల్లోకి రాలేదని పేర్కొన్నారు. మొదటి 100 రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలతో యువతను మోసం చేశారని రామచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులు, విద్యార్థుల రోదన

ఉచిత స్కూటర్లు, మహిళలకు ₹2,500 సాయం, పసిడి హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వకపోగా, పీఆర్సీ అమలును నిర్లక్ష్యం చేశారన్నారు. సుమారు ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డిక్లరేషన్ల పేరుతో మోసం

బీసీ సంక్షేమం అన్నారు, ఎస్సీ డిక్లరేషన్ అన్నారు, రైతు డిక్లరేషన్ అన్నారు.. సమాజంలోని అన్ని వర్గాలకు కొండంత ఆశలు చూపించారు. ఆ డిక్లరేషన్లు, కమిట్‌మెంట్లు ఇప్పుడు ఎక్కడికి పోయాయని నిల‌దీశారు.ఈ 1,000 రోజుల్లో ప్రజలకు మీరు చెప్పింది 1,000 అబద్ధాలు మాత్రమే. ఇది ప్రజా పాలనః కాదు.. ముమ్మాటికీ ప్రజా వంచన పాలన అని అన్నారు.

హైదరాబాద్‌పై కొత్త భారాలు – శాంతిభద్రతలు కుదేలు

నగర ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి హైడ్రా, అనిశ్చితికి హిల్ట్, కొత్త పన్నుల వసూళ్లకు క్యూర్  తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఎమర్జెన్సీ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలని అభివర్ణించిన ఆయన త‌మ‌పై అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా, అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ దాడుల సంస్కృతికి భిన్నంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, ప్రజలను ఏకం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరంతరం పోరాటం సాగిస్తుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *