– పదేళ్లు వాటితోనే పాలన చేశారు
– బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పంపకాల పంచాయితీ
– రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష
నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ గతంలో దళితుడిని సీఎం చేస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ అధికారంలో ఉన్న పదేండ్లలో హామీలు అమలు చేయలేదు అ విమర్శించారు. అబద్ధాలు చెప్పి మోసం చేయడం కేసీఆర్ నైజం అని మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడో విచ్ఛిన్నమైందని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో పంపకాల కోసం అధిపత్య పోరు జరుగుతున్నదన్నారు. ఫ్యామిలీ టెన్షన్స్‌తో కేసీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని, అందుకే జగిత్యాల సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. మొద{ తన ఇల్లు చక్కదిద్దుకోవాలని, ఆ తర్వాత పార్టీ పునర్నిర్మాణం గురించి ఆలోచించాలని కేసీఆర్‌కు సూచించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్ బీఆరఎస్‌లో చేరడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. 2039 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. తన చావు కోరుకుంటున్నారని కేసీఆర్ అనడం సరికాదని, తామెప్పుడూ ఆయన చావుని కోరుకోలేదని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులే సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా ఏకవచనంతో మాట్లాడుతున్నారని, జనం మార్పు కోరుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఉక్రోషంతో ఊగిపోతున్నారని విమర్శించారు. పదేండ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, చివరకు ఔటర్ రింగ్ రోడ్డుని కూడా అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి దీన స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని జీవన్ రెడ్డి ఎందుకు నినాదాలు చేశారు.. పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందుకా.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకా అని ప్రశ్నించారు.
రబీ ధాన్యం సేకరణపై సమీక్ష
రబీ ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని కేంద్రాలకు అవసరమైన లారీలు ఇవ్వాలని, రాత్రి, పగలు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని పేర్కొన్నారు. ధాన్యం ఎక్కువ వచ్చే గ్రామాలకు ఎక్కువ లారీలు పంపాలని, రోడ్లపై ధాన్యం పోయకుండా స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కేంద్రం పెట్టాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 3.78 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి తినే బియ్యమే పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు. పదేళ్లలో అప్పులు చేసి వెళ్లి ఒకేసారి బంగారు తెలంగాణ చేయాలంటే సాధ్యమేనా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం నిల్వల విషయంలో రూ.11 వేల కోట్ల కుంభకోణం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంత మేర ధాన్యం రికవరీ చేయించామని, నల్గొండ జిల్లాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





