‘రైతు ఆశీర్వాద సభ’తో హీటెక్కిన రాజ‌కీయాలు

– మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ‌
– పెద్ద ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు
– కాంగ్రెస్‌పై విరుచుకుప‌డుతున్న విప‌క్షాలు
– ప్ర‌తిప‌క్షాల‌పై కాంగ్రెస్ నేత‌ల‌ ఎదురుదాడి

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 25 : జిల్లాలో మ‌రోసారి రాజ‌కీయాలు వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ‘రైతు ఆశీర్వాద సభ’ ద్వారా రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉండగా మరోవైపు బీఆర్ఎస్ నేతలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), పార్టీ సభ్యత్వ నమోదు సదస్సుల పేరుతో ఖమ్మం బాట పట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అధికార పార్టీ ప్రభుత్వ హామీలను అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  కాగాఅధికార కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30న ఖమ్మం నగర సమీపాన మధిర నియోజకవర్గంలోని మత్కేపల్లి క్రాస్ రోడ్డు, జగన్నాథపురం లో భారీ ఎత్తున ‘రైతు ఆశీర్వాద సభ’ను నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ఈ సభకు రైతులను పెద్ద ఎత్తున తరలించేందుకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఇదే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

విప‌క్షాల‌ విమర్శనాస్త్రాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒకరి తర్వాత ఒకరు ఉమ్మడి ఖమ్మంలో పర్యటించి రైతు సమస్యలను ప్రస్తావిస్తూ ముగ్గురు  మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు దారుణంగా అన్యాయం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు 40 రకాల సన్నాలకు బోనస్ అని చెప్పి, ఇప్పుడు కేవలం 7 రకాలకే పరిమితం చేశారని ఆరోపించారు. ’గ్యారెంటీ కార్డుల’ పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని, ఏడాదికి ప్రతి కుటుంబానికి రెండున్నర లక్షలు ఇస్తామంటూ బాండ్ పేపర్లపై రాసిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ కార్డులను ఇప్పుడు ఎక్కడ పెట్టుకోమంటారని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం ఖమ్మం నగరంలో వచ్చిన మున్నేరు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం హెలికాప్టర్ పంపమని జనం వేడుకున్నా మంత్రులు పట్టించుకోలేదని  విరుచుకుపడ్డారు. మంత్రులు తమ ఆస్తులు పెంచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క కమీషన్ల కోసం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూముల కోసం చూస్తున్నారని, మంత్రి తుమ్మల సత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల అమ్మకాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. వరుసగా మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టి సుమారు రూ.29 వేల కోట్ల ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మధిర సభలో రైతులు ఎందుకు ఆశీర్వదించాలని నిలదీశారు. రైతు క్షమాపణ సభ అని పేరు పెట్టుకోవాలని హరీష్ సూచించారు. నిధులను వరదలా పారించి సీత రామ ప్రాజెక్టును 2026 పంద్రాగష్టు లోగా అందుబాటులోకి తీసుకొస్తామని 2024 ఖమ్మం జిల్లా వైరా సభ, సీతారామ పంప్ హౌస్ ల ప్రారంభం సందర్భంగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిని తుంగలో తొక్కారని, 30న చింతకాని మండలంలో నిర్వహించే రైతు, ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతున్న సీఎం సీతారామ ప్రాజెక్టును పూర్తిచేస్తారో లేదో స్పష్టతనివ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. జిల్లా పాడి రైతులకు ఆశాదీపంగా, దశాబ్దాలుగా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక విజయా డెయిరీ’మూసివేసేందుకు కుట్ర జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. డెయిరీ భూములను రియల్ ఎస్టేట్‌కు అప్పగించే పన్నాగం జరుగుతుందని, ఒక మంత్రి తన సొంత డెయిరీని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని, ప్రభుత్వ డెయిరీ ఇక్కడే కొనసాగితే తన డెయిరీకి రైతుల నుంచి పాల సేకరణ జరగదని, అమ్మకాలకు గండిపడుతుందన్న దురుద్దేశంతోనే ఈ మూసివేత కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

నాలుగు కోట్ల ప్రజల కోసం పాల‌న‌

బీఆర్ఎస్ నేతల విమర్శలపై కాంగ్రెస్ మంత్రులు ధీటుగా స్పందించారు.  బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబంలో కొడుకు, అల్లుడు, కూతురు రాష్ట్రం మీద పడి దోచుకున్నారని,తమకున్న పత్రికలు, సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనంటే నలుగురి కోసం కాదు..  4 కోట్ల ప్రజల కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కఅన్నారు. పదిసార్లు అబద్ధం చెబితే అదే నిజమైపోతుందనే భ్రమలో వారు బతుకుతున్నారని, ఇలాంటి నాయకులు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం అని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ విపక్షాల విమర్శలను రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు,ఓడిపోయిన పార్టీలు ఏవో చెబుతుంటాయని, కానీ కష్టాల్లో కూడా రైతులను ఆదుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బేరీజు వేసుకొని మద్దతు తెలపాలని ఆయన కోరారు.

సీఎం సభ కు భారీ ఏర్పాట్లు

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవరంలోని చింతకాని మండలంలో ఈ నెల 30న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు  హాజరయ్యే ఈ సభకు రెండు లక్షల మంది జన సమీకరణ కోసం భారీ కసరత్తు చేపట్టారు. రైతు భరోసా నిధులను సీఎం చేతుల మీదుగా విడుదల చేయడానికి నిర్వహించనున్న కార్యక్రమమే రైతు ఆశీర్వాద సభ. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో తొలిసారి జరుపుతున్న బహిరంగ సభ ఇదే. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారీ ఖర్చుతో జర్మన్ షెడ్లు వేస్తున్నారు. 30 సీఎం సభ నేపథ్యంలో మొదటి రెండు రోజులు 28, 29 తేదీల్లో రైతు మేళా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. రోజు 5000 మంది రైతులను తరలించేందుకు వ్యవసాయ శాఖకు లక్ష్యం విధించారు. మూడో రోజు సీఎం పాల్గొనే బహిరంగ సభకు జిల్లా నుంచే 1.50 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించేందుకు మూడు వేల బస్సులను ఏర్పాటు చేస్తున్నది. నియోజకవర్గ నుంచి లక్షమంది, మిగతా నియోజకవర్గాల నుంచి మరో 50 వేల మంది తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి సభా ప్రాంగణం, రెండు హెలిపాడ్లు 30 ఎకరాలు, పార్కింగ్ కోసం 100 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వం దాదాపు రూ 5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెల 30న ఖమ్మంలో జరగనున్న రైతు ఆశీర్వాద సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారనుంది. ప్రతిపక్షాలు  సంధించిన ప్రశ్నలకు సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎలా జవాబిస్తుందో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *