భూ వివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

– కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్
– సర్వే (ఎల్‌పిఎం), భూధార్ నెంబర్ల కేటాయింపు
– భూమి హక్కులకు శాశ్వత భరోసా
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారించినపుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుందని అన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా బలోపేతం చేస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి నారాయణపేట జిల్లా కోస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి అనే నిబంధనను భూభారతి చట్టంలో పొందుపరిచామని, అదేవిధంగా ఎవరైనా స్వచ్ఛందంగా తమ ఆస్తులకు సంబంధించిన సర్వే సర్టిఫికెట్‌కు కూడా దరఖాస్తు చేసుకొని ధ్రువీకరించుకోవచ్చని అన్నారు. ఇందులో భాగంగా భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ ఉండాలన్న నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌తో మంగళవారం తొలి రిజిస్ట్రేషన్ చేసి చరిత్రాత్మకమైన అడుగు వేశామన్నారు. సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ అయిన సందర్బంగా మంత్రి స్పందిస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కూసుమంచి మండలంలోని గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 156/ఇ/1లో గల ఎకరా నాలుగు గుంటల భూమిని నేలకొండపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయిస్తున్న సందర్బంగా తన భూమి హద్దులతో కూడిన మ్యాప్‌ను జత చేసి కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించి(భూ కమత పటము-1, భూధార్ నెంబర్ 795GCHDCUPJ7H0ను తహసీల్దార్ కేటాయించారు. ఇదే విధానాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే మ్యాప్, ప్రత్యేక భూధార్ నెంబర్ కేటాయించడం ద్వారా యాజమాన్యంపై ఎలాంటి సందేహాలకు తావు లేకుండా చేస్తోందని భూభారతి పోర్టల్ ద్వారా ఈ సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకు వచ్చిందని చెప్పారు. సర్వే విషయంలో పాత విధానాలకు స్వస్తి చెప్పి అధునాతన రోవర్లను వినియోగిస్తూ కచ్చితత్వంతో సర్వే పూర్తిచేయిస్తున్నామని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *