ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసాకు పెద్ద పీట

– రెండేళ్లలో రూ.లక్ష కోట్లు రైతాంగానికి అందజేశాం
– ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పులు చేసి ఇస్తున్నాం
– పదివేల కోట్లు నష్టం వచ్చినా పంటలు కొనుగోలు చేశాం
– సీఎం సభా వేదికను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌ప్రజాప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం రైతు భరోసా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. జులై నెలలోనే రైతులకు రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండేళ్లలో రూ.లక్ష కోట్లు రైతాంగానికి అందజేశామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేశామని అన్నారు. ఏడాదికి పది వేల కోట్లు నష్టం వచ్చినప్పటికీ కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ కలిపి రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారన్నారు. ఈ సభకు రైతు ఆశీర్వాద సభగా రైతులే నామకరణం చేశారని తెలిపారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ ‌రోడ్డులో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కష్టంలో ఉందని, నిధుల కొరత ఉందని అయినా రైతాంగానికి అండగా ఉండాలని అప్పుచేసి మరీ రైతుభరోసా ఇస్తున్నామని చెప్పారు. ఈనెల 28న రైతు ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభించనున్నట్లు తెలిపారు. 28, 29 రెండు రోజుల పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సభా ప్రాంగణంలో అందుబాటులో ఉంటారన్నారు. 30న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ సభ జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.  భారత దేశంలో అత్యధికంగా పంటలు పండించిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో పంటమార్పిడి విధానంలో ఆయిల్‌ ‌ఫాం సాగును ప్రోత్సహిస్తు న్నామన్నారు. భవిష్యత్తులో పది వేల ఎకరాలను రైతులు సాగు చేసే విధంగా సహకారం అందజేస్తు న్నామని చెప్పారు. దేశంలో తెలంగాణలోనే అత్యధిక ఆయిల్‌ ‌ఫాం సాగు జరుగుతోందన్నారు. పామాయిల్‌ ‌ఫ్యాక్టరీల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. ఏడు రకాల వరి అందుబాటులో ఉందని రైతాంగానికి తుమ్మల తెలియజేశారు. వాతావరణ పరిస్థితులనుబట్టి రైతులు పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. బ్లాక్‌ ‌మార్కెట్‌లో యూరియా ఉంచుతున్నారని, నిల్వ చేసి అధిక ధరలకు అమ్మేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ భయపడవద్దని, అందరికీ యూరియా అందిస్తామని స్పష్టం చేశారు. యూరియా కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చామని, అందులో అన్ని వివరాలు ఉన్నాయన్నారు. ఆ యాప్‌ ‌దేశానికే ఆదర్శమని ప్రధాని మోదీ కూడా ప్రశంసించే పరిస్థితి ఉందన్నారు. రైతాంగం పాడి పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. అత్యధికంగా పురుగు మందులు వాడుతున్నారని ఇక్కడి పంటలను విదేశాలు రిజెక్ట్ ‌చేస్తున్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *