– రేవంత్ వ్యాఖ్యలపై బీఆరఎస్ నేత హరీశ్ రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25 : తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం పక్కనపెట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు నిలదీశారు. ఆర్డీఎస్ నీటి వాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఏదైనా స్పష్టమైన హామీ సాధించారా.. ఆంధ్రా వైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించారా అని ప్రశ్నించారు. కర్ణాటక పరిధిలో ఉన్న ఆర్డీఎస్ కాల్వకు తక్షణమే మరమ్మతులు చేసి క్రమం తప్పకుండా నిర్వహించేలా ఆ రాష్ట్రం నుంచి హామీ తీసుకున్నారా అని అడిగారు. ఈ పనులు జరగకపోవడం వల్లే ఆర్డీఎస్ కింద తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా ప్రతిసారీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. కేవలం తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. గత 75 ఏళ్లుగా పాత గేట్లు పనిచేస్తూనే ఉన్నాయి. అయినా ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదు. తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చడానికీ తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల నీటి వాటాకు ఎలాంటి సంబంధం లేదు అని హరీష్‌రావు స్పష్టం చేశారు. మరి ఈ కీలకమైన విషయంపై రేవంత్ రెడ్డి సాధించిన హామీ ఏమిటన్నారు. ‘సిస్టమ్ లాసెస’ అనే వాదనను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారని అడిగారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డులో ఈ వాదనకు అసలు గుర్తింపే లేదని, ట్రైబ్యునల్ అవార్డు పరిధిలో లేని ఈ వాదనను అడ్డుపెట్టుకుని తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను తగ్గించడానికి వీల్లేదని ఆయన అన్నారు. కృష్ణా జలాలను పరిమితికి మించి ఏపీ వాడుకుంటున్న తీరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కేసీ కెనాల్ కోసం సుంకేసుల వద్ద ఆంధ్రా ప్రభుత్వం ఏకంగా 39 టీఎంసీల నీటిని వాడుకుంటోంది.. దీనికితోడు, కర్ణాటకతో కుమ్మక్కై కేసీ కెనాల్‌కు వెళ్లాల్సిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను ఆర్‌బీహెచఎల్‌సీ, ఆర్‌బీఎలఎల్‌సీలకు మళ్లిస్తోంది.. దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రేవంత్ రెడ్డి ఎందుకు నిలదీయలేదు అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారే కొత్త ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్యలో దాదాపు 35 టీఎంసీలు వాడుకునేలా కర్ణాటక ప్రభుత్వం నవేలి రిజర్వాయర్ నిర్మించాలని చూస్తోంది.. అలాగే ఆర్డీఎస్, సుంకేసుల మధ్య 20 టీఎంసీలు వాడుకునేలా గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలని ఏపీ ప్లాన్ చేస్తోంది.. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు తీవ్ర గండిపడుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు న్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని రేవంత్ రెడ్డి దేనికోసం సంబురాలు చేసుకుంటున్నారు అని హరీష్‌రావు నిలదీశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





