జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌ ? ‌మళ్ళీ నేలవిడిచి సాము చేయడమేనా …

“రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వరుసగా అనేక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌తన పరువును నిలబెట్టుకోవడమన్నది ఇప్పుడు ఆ పార్టీకి ప్రధానమైన అంశం. ఒక విధంగా రానున్న అన్ని ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమే. తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాల్సిన తరుణంలో మళ్ళీ జాతీయ రాజకీయాలవైపు చూడడమన్నది నేల విడిచి సాము చేయడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా సొంత ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందన్న విషయాన్ని మర్చిపోతే 2023 నాటి ఫలితాలే పునరావృతం అవకపోవు..”

జాతీయ రాజకీయాల్లోకి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాబోతున్నారా.. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చ కొనసాగుతున్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటినుండి దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కెసిఆర్‌ ‌నిజంగానే ఏదో మాస్టర్‌ప్లాన్‌తోనే మళ్ళీ యాక్టివ్‌ ‌రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు దీనివల్ల అర్థమవుతున్నది. బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ , ‌మాజీ మంత్రి కెటిఆర్‌ ‌తాజాగా కెసిఆర్‌ ‌విషయంలో చేసిన ప్రకటన ఒక విధంగా తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని లేపేదిగా  ఉంది. రాష్ట్రంలో మూడేళ్ళుగా అధికారంలోఉన్న కాంగ్రెస్‌, ‌పాలనావిషయంలో విఫలమైందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. దీంతో కెసిఆర్‌ ‌తిరిగి ముఖ్యమంత్రిగా రావాలంటూ పార్టీ వర్గాలతోపాటు వివిధ వర్గాలవారు ప్రసార మాధ్యమాల ద్వారా  విజ్ఞప్తులు చేస్తున్న క్రమంలో కెటిఆర్‌ ‌చేసిన ప్రకటన ఆ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నప్పటికీ, కెసిఆర్‌ ‌మళ్ళీ అ పొరపాటు చేస్తారా అన్న అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఆవిర్భవింపజేసిన కెసిఆర్‌ ‌తొమ్మిదిన్నరేండ్లు  ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక తనకు ఎదురు లేదనుకున్న  ఆయన జాతీయ రాజకీయాలవైపు తన దృష్టిని మళ్ళించారు. కేంద్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిఉందంటూ అందుకు ప్రత్యమ్నాయంగా థర్డ్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన విషయం తెలియంది కాదు.కాంగ్రెస్‌, ‌బిజెపిలను వ్యతిరేకించే పార్టీలన్నిటితో ఈ థర్డ్ ‌ఫ్రంట్‌కు ఆయన తీవ్రంగా కృషిచేశారు కూడా. దానికి ముందే తమ పార్టీ టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా( 2022 అక్టోబర్‌5‌న దసరారోజున) నామకరణంచేసి జాతీయ పార్టీగా  ప్రకటించారు. మమతా బెనర్జీ, స్టాలిన్‌, ‌నితీష్‌కుమార్‌, ‌నవీన్‌పట్నాయక్‌, ‌కుమారస్వామి లాంటి వివిధ రాష్ట్రాల నేతలతో నేరుగా సంప్రదింపులుకూడా జరిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపి రాష్ట్రాల్లో తమ పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా థర్డ్‌ఫ్రంట్‌ అభ్యర్థులను నిలబెట్టేందుకు కావల్సిన నిధులను కూడా సమకూరుస్తామన్నారు. ఒకవిధంగా దేశవ్యాప్త రాజకీయాల్లో కెసిఆర్‌ ‌చర్చ జరుగుతూవచ్చింది.
కాని, 2023 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. లోక్ సభ  ఎన్నికల్లో 17 స్థానాలకుగాను ఒక్కటంటే ఒక్కటికూడా బిఆర్‌ఎస్‌ ‌గెలుచుకోలేకపోయింది.దాంతో థర్డ్‌ఫ్రంట్‌ ‌చతికిలపడింది. ఉట్టికి ఎక్కలేనిది స్వర్గానికి నిచ్చనలు వేసినట్లుందన్న విమర్శ సర్వత్రా వినిపించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌దెబ్బమీద దెబ్బకొడుతూ వచ్చింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భవిష్యత్‌లో  బిఆర్‌ఎస్‌కు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తానని కంకణం కట్టుకుని కూర్చున్నాడు. తెలంగాణ సాధించిన నేతగా పేరున్న కెసిఆర్‌ ‌పేరును శాశ్వతంగా తుడిచివేస్తానంటున్నాడు. ఫామ్‌హౌస్‌కే ఆయనను  పరిమితం చేయగలిగానని పలు సభలు, సమావేశాల్లో వల్లె వేస్తున్నాడు. కారణం ఏమిటన్నది ఇంతవరకు స్పష్టంగా చెప్పకపోయినా కెసిఆర్‌ అసెంబ్లీలో నేటివరకు అడుగు పెట్టలేదు. అయినా కెసిఆర్‌ ‌ముఖ్యమంత్రిగా తిరిగిరావాలంటూ ప్రజలనుండి నినాదాలు వినిపిస్తున్నాయి. అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పాలనా వైఫల్యాలే కారణంగా ఎత్తిచూపుతున్నారు. ఈ తరుణంలో కెటిఆర్‌ ‌తాజా ప్రకటన బిఆర్‌ఎస్‌ ‌పార్టీతోపాటు కెసిఆర్‌ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని కలిగించిందనడంలో అతిశయోక్తిలేదు.

దేశంలో అధికారంలో ఉన్న  బిజెపి సంకీర్ణకూటమిపై ఆధారపడి ఉండటం వల్ల పాలనా విషయంలో బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది. బలమైన పార్టీ బలహీనంగా మారుతున్నది. ‘ఇండీ’ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించలేకపోతున్నది. అంతేకాకుండా ఈ కూటమిలో సమన్వయలోపం ఆ పార్టీని ఎప్పుడూ వెనక్కి లాగుతున్నది. కూటమినుండి ఒక్కొక్కరుగా బయటికి వెళుతున్నారు. కాబట్టి మరో కొత్త కూటమి ఏర్పాటుకు ఇది మంచి సమయని బిఆర్‌ఎస్‌ ఆలోచిస్తున్నట్లు కెటిఆర్‌ ‌మాటలవల్ల తెలుస్తున్నది.  రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ  ఎన్నికలతోపాటు వరుసగా అనేక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌తన పరువును నిలబెట్టుకోవడమన్నది ఇప్పుడు ఆ పార్టీకి ప్రధానమైన అంశం. ఒక విధంగా రానున్న అన్ని ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమే. తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాల్సిన తరుణంలో మళ్ళీ జాతీయ రాజకీయాలవైపు చూడడమన్నది నేల విడిచి సాము చేయడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  ముందుగా సొంత  ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉందన్న విషయాన్ని మర్చిపోతే 2023 నాటి ఫలితాలే పునరావృతం అవకపోవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *