పాలమూరుకు కేసీఆర్ న‌మ్మ‌క‌ద్రోహం

– కేటీఆర్ గడ్డం పెంచితే  రేవంత్ అయిపోడు
– కాళేశ్వరం డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ కుంగుబాటు
– డిసెంబర్‌లో కాళేశ్వరం, ఎల్‌నినోపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
– హైదరాబాద్- లగచర్లను దిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేస్తాం
– ఎల్‌నినోతో నీటి ఎద్దడి తప్పదు
– కొడంగ‌ల్ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి  కొడంగల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాంతానికి తగిన న్యాయం జరగలేదని సీఎం ఆరోపించారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినప్పటికీ, ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని విమర్శించారు. పదేళ్ల పాలనలో రూ.20 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ ఖర్చు చేసినప్పటికీ కీలక ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని అన్నారు. మూడు రోజుల కొడంగల్‌ పర్యటనలో భాగంగా శనివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, సభల్లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ పాలన, సాగునీటి ప్రాజెక్టులు, ఎల్‌నినో ప్రభావం, కొడంగల్‌ అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం అంచనా వ్యయాన్ని భారీగా పెంచారని ఆరోపించారు. సుమారు రూ.1.5 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లకే సమస్యలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణాలు, నిర్మాణ నాణ్యత, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు.

కేటీఆర్‌కు బుద్ధి రావడానికి ఇంకెన్నాళ్లో?

తనను చూసి కేటీఆర్‌ గడ్డం పెంచుకుంటున్నారని, వేషభాషలు మార్చుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన రేవంత్‌రెడ్డి కాలేరని, ఎన్ని జన్మలెత్తినా తనలా కాలేరంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ తనను అనుకరిస్తున్నారని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. తనకు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టిందని, కేటీఆర్‌కు బుద్ధి రావడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్లుగా ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో బీఆర్ఎస్‌కు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఎల్‌నినోతో నీటి ఎద్దడి ముప్పు

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలోనూ జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎల్‌నినో అంశంపై బీఆర్ఎస్‌ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఈ అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్‌ నేతలు అసెంబ్లీకి రావాలని సవాల్‌ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భూముల వ్యవహారాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు స్పీకర్‌ అనుమతి కోరుతున్నామని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీలో 16 టీఎంసీల నీరు ఉంటేనే కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుందని సీఎం వివరించారు. బ్యారేజీ దెబ్బతినడంతో పంపుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్ల నిర్వహణ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎవరు అడ్డుపడ్డారు?

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరామని, ఆ విచారణ జరగకుండా అడ్డుకున్నదెవరో బీఆర్ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్గొండ ప్రాంతానికి నీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా సాగునీరు అందించవచ్చన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే రైతులకు నీరు అందుతోందని, తుపాకులగూడెంకు కూడా అక్కడి నుంచే నీటిని తరలిస్తున్నామని వివరించారు.

కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు

కొడంగల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మక్తల్‌-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కొడంగల్‌కు రావాల్సిన పరిశ్రమలను గతంలో సిరిసిల్లకు తరలించారని బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేశారు.
భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తమ ప్రభుత్వం ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం అందిస్తోందని తెలిపారు. గతంలో ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు ఇవ్వడానికి కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. హకీంపేటలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌-లగచర్ల ప్రాంతాన్ని ఢిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు, ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.

రైతు మేలా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పో ప్రారంభం 

కొడంగల్‌ పర్యటనలో భాగంగా హకీంపేటలో మెగా రైతు మేలా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రదర్శనలను పరిశీలించారు. ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హకీంపేటలో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులను పరిశీలించారు. సాగునీటి లభ్యత, రైతుల అవసరాలు, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని సీఎం తెలిపారు.

———————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *